కోటి వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటుతో 2-3 కోట్ల ఉద్యోగాల సృష్టి

ప్రస్తుత టెలికాం విధానం కింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒక కోటి బహిరంగ (పబ్లిక్‌) వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు కానున్నాయని, దీని ద్వారా 2-3 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని టెలికాం కార్యదర్శి కె.రాజరామన్‌

Published : 23 Jan 2022 03:01 IST

టెలికాం కార్యదర్శి

దిల్లీ: ప్రస్తుత టెలికాం విధానం కింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒక కోటి బహిరంగ (పబ్లిక్‌) వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు కానున్నాయని, దీని ద్వారా 2-3 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని టెలికాం కార్యదర్శి కె.రాజరామన్‌ తెలిపారు. ప్రధానమంత్రి వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌ (పీఎం-డబ్ల్యూఏఎన్‌ఐ) పథకం కింద ఈ హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను వైఫై సామగ్రి తయారీదార్లు వారి ఉత్పత్తుల వ్యయాలను తగ్గించాల్సిందిగా బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరమ్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజారామన్‌ పిలుపునిచ్చారు. ‘ఒక్కో హాట్‌స్పాట్‌ ద్వారా 2-3 వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభించొచ్చని అంచనా. నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ కింద 2022 కల్లా ఒక కోటి హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే చిన్న, మధ్య తరహా రంగాల్లో 2-3 కోట్ల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంద’ని రాజరామన్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థల వృద్ధికి పబ్లిక్‌ హాట్‌స్పాట్‌లు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా సామాజిక- ఆర్థిక వృద్ధికి దోహదం చేసి, తద్వారా గ్రామీణ ప్రాంతాల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందకు తోడ్పడుతాయనే అభిప్రాయం ఉంది. పీఎం- డబ్ల్యూఏఎన్‌ఐ పోర్టల్‌ ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 56,000 వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మరింత మంది వ్యాపారులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా రాజరామన్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని