అంకురాలకు పెట్టుబడుల భరోసా

ఒక వినూత్న ఆలోచన... దాన్ని ఆచరణలో పెట్టగల సామర్థ్యం.. ఎన్నో అంకురాలు ఆవిర్భవించేందుకు మూల సూత్రం ఇదే. కంపెనీని సృష్టించగలిగితే.. దానికి అవసరమైన పెట్టుబడుల కోసం మేమున్నాం అంటూ..

Published : 23 Jan 2022 03:07 IST

2021లో రెట్టింపైన పెట్టుబడులు

ఆకర్షిస్తోన్న ఫిన్‌టెక్‌, డిజిటల్‌ హెల్త్‌ రంగాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఒక వినూత్న ఆలోచన... దాన్ని ఆచరణలో పెట్టగల సామర్థ్యం.. ఎన్నో అంకురాలు ఆవిర్భవించేందుకు మూల సూత్రం ఇదే. కంపెనీని సృష్టించగలిగితే.. దానికి అవసరమైన పెట్టుబడుల కోసం మేమున్నాం అంటూ.. ఎంతోమంది పెట్టుబడిదారులు, వెంచర్‌ క్యాపిటలిస్టులూ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. దీంతో భారత్‌లో అంకురాలు గతంతో పోలిస్తే అధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.
కరోనా ప్రభావంతో అంకురాలు తమ పరిస్థితి ఏమిటన్నది తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కానీ, కరోనా తెచ్చిన డిజిటలైజేషన్‌ వృద్ధి ఎన్నో అంకురాలకు ప్రయోజనం కల్పించింది. అందుకే, వీటిల్లోకి పెట్టుబడుల వరద సాగింది. ఇటీవల నాస్కాం-జిన్నోవ్‌ విడుదల చేసిన సర్వే ప్రకారం 2021లో టెక్‌ స్టార్టప్‌లలోకి కొత్తగా రూ.1.80 లక్షల కోట్లు (24.1 బిలియన్‌ డాలర్లు) మేరకు పెట్టుబడులు వచ్చాయి. కొవిడ్‌ ముందు పరిస్థితితో పోల్చి చూసినా ఇది రెండు రెట్లు అధికం. పలు అంకుర సంస్థలు 2021లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించేందుకు పెట్టుబడులు అధికంగా రావడమే కారణమని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రాథమిక స్థాయిలో ఉన్నా..

సాధారణంగా అంకురాలకు పెట్టుబడులు రావాలంటే.. ఆలోచన దశ నుంచి బయటకు రావాలి. మంచి బృందం, ఆ ఉత్పత్తి, సేవలకు గిరాకీ, ఆదాయం ఆర్జించడంలాంటివి ఉండాలి. అప్పుడే వెంచర్‌ క్యాపిటలిస్టులు వాటివైపు చూస్తుంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక ఆలోచనకు భవిష్యత్తులో మంచి వృద్ధి ఉంటుందని భావిస్తే చాలు పెట్టుబడులు వస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఎండియా పార్ట్‌నర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీశ్‌ ఆండ్ర పేర్కొన్నారు. అంకురాలకు ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఉన్న అంకురాలకు గత ఏడాదిలో రూ.7,500 కోట్లకు పైగానే పెట్టుబడులు సమకూరాయని తెలిపారు.

వీటివైపే మొగ్గు..

కొవిడ్‌ తర్వాత ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా ఫిన్‌టెక్‌, డిజిటల్‌ హెల్త్‌టెక్‌, డిజిటల్‌ ఆరోగ్య పరికరాల ఉత్పత్తి సంస్థలకు పెట్టుబడులు విశేషంగా వచ్చాయి. ఇ-కామర్స్‌, ఎడ్యుటెక్‌, డీ2సీ (డైరెక్ట్‌ టు కస్టమర్‌), సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సాస్‌ రంగాల్లో రాణించిన కంపెనీలకూ ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, వెంచర్‌ క్యాపిటలిస్టులు మద్దతు పలికారు. ఇక మీడియా, గేమింగ్‌లాంటి సంస్థలూ కొన్ని పెట్టుబడులను ఆకర్షించాయి. గత ఏడాదిలో 100కు పైగా లావాదేవీలు ఒక్కోటి 100 మిలియన్‌ డాలర్లకు పైగానే ఉన్నాయి.

భవిష్యత్తులో...

ఫిన్‌టెక్‌, డిజిటల్‌ హెల్త్‌టెక్‌, ఇ-కామర్స్‌, లాజిస్టిక్‌, ఏఐ సంస్థలకు రానున్న రోజుల్లోనూ నిధులు వస్తాయి. వీటితోపాటు వెబ్‌3.0, బ్లాక్‌చైన్‌, క్రిప్టో, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, చిప్‌ తదితర విభాగాల్లో పనిచేస్తున్న అంకురాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెటావర్స్‌ ఇప్పుడు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా.. రానున్న ఏడాది, రెండేళ్లకాలంలో ఇది కీలక భూమిక పోషిస్తుందనడంలో సందేహం లేదని నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్‌ నుంచీ యూనికార్న్‌లు...‘

బెంగళూరు, ముంబయి, దిల్లీల తర్వాత అంకురాలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారుతోంది. ఆ నగరాలతో పోలిస్తే మన దగ్గర వెంచర్‌ క్యాపిటలిస్టులు తక్కువగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇక్కడి అంకురాలు ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. అవకాశాలున్న చోటకు డబ్బు వెళ్తుంది. మన చుట్టూ ఉన్న సంస్థలు విజయం సాధిస్తూ ఉంటే.. కొత్తవారికి ఉత్సాహం కలుగుతుంది. ఇక్కడా నిపుణుల లభ్యత అధికంగానే ఉంది. పలు సంస్థలు ఆర్‌అండ్‌డీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లలోనే హైదరాబాద్‌ నుంచి యూనికార్న్‌లు ఆవిర్భవించడం చూస్తాం.’

- సతీశ్‌ ఆండ్ర, ఎండియా పార్ట్‌నర్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని