సూక్ష్మ రుణాల నుంచి బంగారం తనఖా రుణాల్లోకి!

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్స్‌ పద్మజారెడ్డి రెండో ఇన్నింగ్‌ మొదలుపెట్టబోతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన సూక్ష్మరుణ వ్యాపారం నుంచి బయటకు వచ్చి బంగారం తనఖా రుణాల వ్యాపారాన్ని

Published : 23 Jan 2022 03:08 IST

స్పందన స్ఫూర్తి పద్మజారెడ్డి అడుగులు

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్స్‌ పద్మజారెడ్డి రెండో ఇన్నింగ్‌ మొదలుపెట్టబోతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన సూక్ష్మరుణ వ్యాపారం నుంచి బయటకు వచ్చి బంగారం తనఖా రుణాల వ్యాపారాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాల్లో ఆమె తలమునకలుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌లో సంస్థాగత ఇన్వెస్టర్‌ అయిన కేదారా కేపిటల్‌తో విభేదాలు రావడంతో ఆ సంస్థ ఎండీ పదవికి పద్మజారెడ్డి రాజీనామా చేసి బయటకు రావటం తెలిసిందే. తాను స్థాపించిన సంస్థ నుంచి ఇలా బయటకు వెళ్లిపోవలసి వస్తుందని ఆమె ఊహించి ఉండరు. కానీ పరిస్థితులు అలా మారాయి. ఫలితంగా ఆమె ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. బంగారం తనఖా రుణాల వ్యాపారం మంచి అవకాశంగా భావించి, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ‘స్పందన మ్యూచువల్‌ బెనిఫిట్స్‌ ట్రస్ట్‌’ పేరుతో బంగారం రుణాల వ్యాపారాన్ని చేపట్టి, రూ.100 కోట్లకు పైగా ‘గోల్డ్‌ లోన్‌’ పోర్ట్‌ఫోలియోని నిర్మించినట్లు సమాచారం. దీన్ని ఇంకా పెద్దది చేసే లక్ష్యంతో ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ను కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందువల్ల బంగారం తనఖా రుణాల వ్యాపారాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం తనఖా రుణాల వ్యాపారాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.5 లక్షల కోట్ల స్థాయికి ఈ రంగం

బంగారం తనఖా రుణాల వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. బ్యాంకుల రిటైల్‌ రుణాల్లో గత రెండేళ్లలో  బంగారం తనఖా రుణాలే అధికమనేది గమనించాల్సిన అంశం. మనదేశంలో బంగారం తనఖా రుణాల వ్యాపారం త్వరలో రూ.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోనుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. పూర్తి హామీ ఉండే రుణాలు కావడంతో రానిబాకీల సమస్య తక్కువ. ఈ విభాగంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌, మణప్పురం అగ్రగామి సంస్థలుగా ఉండగా, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులైన ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంకు, కర్నాటక బ్యాంకుతో పాటు పలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా పెద్దఎత్తున నిర్వహిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని