
ప్రభుత్వ సంస్థల కొనుగోలుకు వేదాంతా రూ.75,000 కోట్ల నిధి ఏర్పాటు
ఛైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడి
దిల్లీ: ప్రభుత్వం బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) వంటి సంస్థల్ని విక్రయించేందుకు ధర ప్రకటించిన తర్వాత, 10 బిలియన్ డాలర్లతో (సుమారు రూ.75,000 కోట్లు) ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వేదాంతా రిసోర్సెస్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఆకర్షణీయ ధరల్లో లభించే ప్రభుత్వ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వేదాంతా సొంత వనరుల నుంచే కాకుండా బయట నుంచి వచ్చే పెట్టుబడులతో ఈ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీనికోసం సార్వభౌమ వెల్త్ ఫండ్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. 10 ఏళ్ల కాల పరిమితితో ఈ నిధిని ఏర్పాటు చేసి, దీన్ని ప్రైవేటు ఈక్విటీ-రకం వ్యూహంతో కంపెనీల కొనుగోలుకు వినియోగిస్తామన్నారు. వాటి లాభదాయకతను పెంచిన తర్వాత మంచి విలువతో బయటకు వస్తామని వివరించారు. లండన్‌కు చెందిన సెంట్రికస్ సంస్థతో కలిసి 10 బి.డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తామని, ఈ నిధితో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయాల్లో పాల్గొని సొంతం చేసుకుంటామని గతంలో అనిల్ అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీపీసీఎల్, ఎస్సీఐ సంస్థలకు సంబంధించిన ప్రైస్ (ధర) బిడ్లు ఈ నెల ప్రారంభంలో వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించిన తదుపరి తేదీలు ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించిన వెంటనే నిధుల్ని సమీకరిస్తామని అనిల్ అగర్వాల్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.