
ఎఫ్‌ఆర్‌ఎల్‌లో రూ.7,000 కోట్ల
పెట్టుబడికి సమారా సిద్ధమే
అమెజాన్ స్పష్టీకరణ
దిల్లీ: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌ను (ఎఫ్‌ఆర్‌ఎల్) రుణ చెల్లింపుల వైఫల్యం నుంచి తప్పించేందుకు సమారా కేపిటల్ సిద్ధంగా ఉందని ఎఫ్‌ఆర్‌ఎల్‌కు అమెజాన్ స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చెందిన బిగ్‌బజార్ లాంటి రిటైల్ ఆస్తుల కొనుగోలు నిమిత్తం రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సమారా కేపిటల్ ఇప్పటికీ ఆసక్తితోనే ఉందని తెలియజేసింది. ఇందుకుగాను ఆర్థిక సంబంధిత వివరాలను సమారాకు సమర్పించాల్సిందిగా ఎఫ్‌ఆర్‌ఎల్‌కు అమెజాన్ సూచించింది. జనవరి 29 కల్లా రుణ సంస్థలకు రుణాలు చెల్లించాల్సి ఉన్నందున రూ.3,500 కోట్లు ఇచ్చే విషయంపై జనవరి 22 కల్లా తమకు స్పష్టత ఇవ్వాల్సిందిగా ఎఫ్‌ఆర్‌ఎల్ డైరెక్టర్లు అమెజాన్‌ను అడిగారు. దీనిపై స్పందిస్తూ ‘పెట్టుబడులు పెట్టే విషయంపై సుముఖంగానే ఉన్నట్లు సమారా కేపిటల్ మాకు మళ్లీ తెలియజేసింద’ని ఎఫ్‌ఆర్‌ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు అమెజాన్ ఓ లేఖ రాసింది. 2020 జూన్ 30న కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని సమారా పునరుద్ఘాటించిందని అందులో పేర్కొంది. రూ.7,000 కోట్లతో ఎఫ్‌ఆర్‌ఎల్ ఆస్తుల కొనుగోలు నిమిత్తం సమారా, ఎఫ్‌ఆర్‌ఎల్, ఎఫ్‌ఆర్‌ఎల్ ప్రమోటర్ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఈ లావాదేవీల వ్యవహారంపై సమారా కేపిటల్ నేరుగా ఎఫ్‌ఆర్‌ఎల్‌తో కాకుండా అమెజాన్ ద్వారా సంప్రదింపులు చేయించడం వెనక కారణాన్ని అమెజాన్ వెల్లడించలేదు. అదే సమయంలో ఈ వ్యవహారంపై ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. అయితే రిలయన్స్ రిటైల్‌కు ఆస్తులు అమ్మకుండా ఎఫ్‌ఆర్‌ఎల్‌ను ఆపాలనే ప్రయత్నంలో భాగంగానే సమారా, ఎఫ్‌ఆర్‌ఎల్ మధ్య అమెజాన్ మధ్యవర్తిత్వం నడుపుతున్నట్లుగా కన్పిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య కుదిరిన ఒప్పందం వ్యవహారంపై ఇప్పటికే ఫ్యూచర్, అమెజాన్ మధ్య తీవ్ర న్యాయపోరాటం నడుస్తున్న సంగతి తెలిసిందే.