చట్టబద్దంగా లేని ప్రతిపాదనను అంగీకరించలేం

రుణ చెల్లింపుల వైఫల్యం నుంచి ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)ను గట్టెక్కించేందుకు సమారా కేపిటల్‌ ద్వారా నిధుల సహకారం అందిస్తామంటూ అమెజాన్‌ చేసిన ప్రతిపాదనను ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లు తిరస్కరించారు. చట్టబద్దంగా లేని

Published : 25 Jan 2022 02:44 IST

అమెజాన్‌ ‘నిధుల’ సహకార ప్రతిపాదనపై ఎఫ్‌ఆర్‌ఎల్‌

దిల్లీ: రుణ చెల్లింపుల వైఫల్యం నుంచి ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)ను గట్టెక్కించేందుకు సమారా కేపిటల్‌ ద్వారా నిధుల సహకారం అందిస్తామంటూ అమెజాన్‌ చేసిన ప్రతిపాదనను ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లు తిరస్కరించారు. చట్టబద్దంగా లేని ఎటువంటి ప్రతిపాదనకు అంగీకారం తెలపబోమని స్పష్టం చేశారు. ‘చట్టబద్దత లేని, సమయానికి పూర్తి కాని ఆఫర్‌ను మేం స్వీకరించబోం. ఒకవేళ సాయం చేయాలని అనుకుంటే.. ఆ డబ్బులు ఎలా తీసుకొస్తారో మాకు తెలియజేయండి. బ్యాంకులకు రుణాలు చెల్లించేందుకు, మీపైన విశ్వాసంతో ఇప్పటికిప్పుడు రూ.3,500 కోట్లు ఇవ్వమని అడిగామ’ని ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టరు రవీంద్ర ధరివాల్‌ తెలిపారు. ఎగవేతదారుగా మారకుండా ఆపేందుకు అవసరమైన డబ్బును ఎలా తెస్తుందనే విషయాన్ని ఇప్పటివరకు అమెజాన్‌ తమకు చెప్పలేదని ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లు అంటున్నారు. సమారా కేపిటల్‌, తమ మధ్య మధ్యవర్తిత్వం జరపాలని మాత్రమే అమెజాన్‌ అనుకుంటుందా అనే విషయం తమకు తెలియాలని వివరించారు. ఒప్పంద లావాదేవీ జరిగేలా సమారా కేపిటల్‌ తరపున సంప్రదింపులు జరిపే అధికారం అమెజాన్‌కు ఉందా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చెందిన రిటైల్‌ ఆస్తుల కొనుగోలు నిమిత్తం సమారా కేపిటల్‌ రూ.7,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు అమెజాన్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. కేవలం ప్రచారయావతోనే ఈ ప్రతిపాదనను తమ దృష్టికి తీసుకొచ్చినట్లుగా ఉందని ధవాల్‌ అభిప్రాయపడ్డారు. ‘ఈ విషయంపై సమారా కేపిటల్‌ మిమ్మల్ని నేరుగా సంప్రదించిందా’ అనే ప్రశ్నకు ఆయన అలాంటిదేమీ ఇప్పటివరకు జరగలేదని బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని