అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ చేతికి అవ్రా ల్యాబ్స్‌లో మెజార్టీ వాటా

ప్రముఖ శాస్త్రవేత్త, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డుల గ్రహీత డాక్టర్‌ ఏవీ రామారావు నెలకొల్పిన అవ్రా లేబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో, ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల సంస్థ అయిన అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ మెజార్టీ వాటా కొనుగోలు

Published : 25 Jan 2022 02:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ శాస్త్రవేత్త, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డుల గ్రహీత డాక్టర్‌ ఏవీ రామారావు నెలకొల్పిన అవ్రా లేబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో, ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల సంస్థ అయిన అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. ఈ లావాదేవీ విలువ 100 మిలియన్‌ డాలర్ల  (దాదాపు రూ.750 కోట్ల) వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వాటా కొనుగోలుకు సంబంధించి డాక్టర్‌ రామారావు, ఆయన కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. 1995లో ప్రారంభమైన అవ్రా ల్యాబ్స్‌ క్రామ్స్‌ (కాంట్రాక్టు ఉత్పత్తి, పరిశోధనా సేవలు), ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) ఔషధాల ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 4 యూనిట్లు ఈ సంస్థకు ఉన్నాయి. అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలకు పరిశోధనా సేవలు అందించడంతో పాటు నూతన జనరిక్‌ మాలిక్యూల్స్‌ను, కస్టమ్‌ సింథసిస్‌ సేవలను అవ్రా ల్యాబ్స్‌ అందిస్తోంది. పలు దేశ, విదేశీ పరిశోధనా సంస్థలతో దీనికి భాగస్వామ్యాలు ఉన్నాయి. ఎన్నో పేటెంట్లు సైతం ఈ సంస్థకు ఉన్నాయి. కేన్సర్‌ చికిత్సకు అవసరమైన యాంటీబాడీ డ్రగ్‌ కంజుగేట్స్‌లో వినియోగించే కాప్టోథెసిన్‌ అనలాగ్స్‌కు సింథటిక్‌ ప్రాసెస్‌ను విజయవంతంగా ఆవిష్కరించిన ఘనత అవ్రా ల్యాబ్స్‌కు ఉన్నట్లు అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది.  అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ భాగస్వామ్యంతో తాము ప్రపంచ విపణిలో ఇంకా విస్తరించే అవకాశం ఏర్పడుతుందని డాక్టర్‌ ఏవీ రామారావు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని