2026కు రూ.22.5 లక్షల కోట్లు

దేశంలో 2026 నాటికి 30,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.22.5 లక్షల కోట్లు) ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ఉత్పత్తి జరగొచ్చని పరిశ్రమ సమాఖ్య ఐసియా అంచనా వేసింది. ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానం-2019 (ఎన్‌పీఈ) కింద 2025 నాటికే 40,000 కోట్ల

Published : 25 Jan 2022 02:55 IST

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిపై ఐసియా

దిల్లీ: దేశంలో 2026 నాటికి 30,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.22.5 లక్షల కోట్లు) ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ఉత్పత్తి జరగొచ్చని పరిశ్రమ సమాఖ్య ఐసియా అంచనా వేసింది. ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానం-2019 (ఎన్‌పీఈ) కింద 2025 నాటికే 40,000 కోట్ల డాలర్ల (రూ.30 లక్షల కోట్ల) ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అది సాధ్యం కాదని ఐసియా నివేదిక పేర్కొంటోంది. కొవిడ్‌-19 మహమ్మారి పరిణామాలు ఎలక్ట్రానిక్స్‌ రంగంపై భారీగా ప్రభావం చూపించాయని, ఎన్నడూ చూడని విధంగా సవాళ్లు ఎదురయ్యాయని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 30,000 కోట్ల డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి అనేది వాస్తవిక పరిస్థితిగా ఉంటుందని వివరించింది. తగ్గించిన లక్ష్యం కూడా ప్రస్తుత స్థాయి నుంచి 400 శాతం అధికంగా ఉందని నివేదిక విడుదల సందర్భంగా ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసియా) ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో వెల్లడించారు. పరిశ్రమను సంప్రదించకుండా ప్రభుత్వం పన్ను టారిఫ్‌ల మార్పు జోలికి వెళ్లకుండా ఉండాలని కోరారు. 2025-26 నాటికి దేశంలో 18,000 కోట్ల డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందని నివేదిక అంచనా వేసింది. తాజాగా నిర్దేశించిన 30,000 కోట్ల డాలర్ల లక్ష్యాన్ని చేరుకోగలిగితే అంతర్జాతీయ విపణికి 12,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లు) విలువైన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చని పేర్కొంది.

దేశీయ మొబైల్‌ ఓఎస్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగానికి గూగుల్‌ ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఐఓఎస్‌లకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఆపరేటింగ్‌ వ్యవస్థను రూపొందించేందుకు పరిశ్రమకు అవసరమైన వ్యవస్థల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.ఇందుకోసం అంకురాలు, విద్యాసంస్థల సామర్థ్యాల వైపు చూస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని