-1082 నుంచి +367 పాయింట్లకు

అయిదు రోజుల వరుస నష్టాల తరవాత మంగళవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో 1082 పాయింట్లు కోల్పోయి 57000 పాయింట్ల దిగువకు చేరిన సెన్సెక్స్‌.. మళ్లీ బలంగా పుంజుకుని లాభాల్లో

Published : 26 Jan 2022 03:53 IST

అయిదు రోజుల వరుస నష్టాల తరవాత మంగళవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో 1082 పాయింట్లు కోల్పోయి 57000 పాయింట్ల దిగువకు చేరిన సెన్సెక్స్‌.. మళ్లీ బలంగా పుంజుకుని లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్‌, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కలిసొచ్చింది. సానుకూల ఐరోపా సంకేతాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు తగ్గి నెల కనిష్ఠమైన 74.78 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,158.63 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 56,409.63 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. దిగువ స్థాయుల వద్ద కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్‌, లాభాల్లోకి వచ్చి 57,966.93 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 366.64 పాయింట్ల లాభంతో 57,858.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128.85 పాయింట్లు పుంజుకుని 17,277.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,836.80- 17,309.15 పాయింట్ల మధ్య కదలాడింది.

లాభం 3 రెట్లు పెరగడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో 7.18% దూసుకెళ్లి రూ.754.95 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 6.76% లాభంతో రూ.751.95 వద్ద ముగిసింది. మార్కెట్‌ విలువ  రూ.14,608.78 కోట్లు పెరిగి రూ.2,30,678.78 కోట్లకు చేరింది.

మారుతీ సుజుకీ షేరు ఇంట్రాడేలో 7.63% పరుగులు తీసి రూ.8661.60 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 6.88% లాభంతో రూ.8600.60 దగ్గర స్థిరపడింది.

ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు 4.44% పెరిగి రూ.850.25 దగ్గర స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 6.76%, ఎస్‌బీఐ 4.20%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.87%, భారతీ ఎయిర్‌టెల్‌ 3.23%, పవర్‌గ్రిడ్‌ 2.27%, ఎన్‌టీపీసీ 2%, హెచ్‌యూఎల్‌ 1.83%, ఎల్‌ అండ్‌ టీ 1.31%, ఐటీసీ 1.16% మెరిశాయి. విప్రో 1.75%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.16%, టైటన్‌ 0.98%, ఇన్ఫోసిస్‌    0.85%, అల్ట్రాటెక్‌ 0.79% చొప్పున నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో టెలికాం, యుటిలిటీస్‌, విద్యుత్‌, వాహన, బ్యాంకింగ్‌, స్థిరాస్తి 2.46 శాతం వరకు పెరిగాయి. ఐటీ, మన్నికైన వినిమయ వస్తువులు పడ్డాయి.

నేడు మార్కెట్లకు సెలవు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు (బుధవారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని