ఎగవేతదారుగా ప్రకటించకుండా నిరోధించాలి

నిర్ణీత గడువులోగా బకాయిలను చెల్లించనందున, ఫ్యూచర్‌ రిటైల్‌కు చాలా మంది రుణదాతలు దివాలా ప్రక్రియ ప్రారంభిస్తామనే హెచ్చరిక నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ రిటైల్‌ మంగళవారం

Updated : 26 Jan 2022 04:25 IST

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఫ్యూచర్‌ రిటైల్‌

దిల్లీ: నిర్ణీత గడువులోగా బకాయిలను చెల్లించనందున, ఫ్యూచర్‌ రిటైల్‌కు చాలా మంది రుణదాతలు దివాలా ప్రక్రియ ప్రారంభిస్తామనే హెచ్చరిక నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ రిటైల్‌ మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థను ఎగవేతదారుగా ప్రకటించకుండా అడ్డుకోవాలని అభ్యర్థించింది. ఎగవేతదారుగా ప్రకటిస్తే, దివాలా ప్రక్రియ ప్రారంభించే వీలుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆఫర్‌ చేసిన మొత్తంతో పోలిస్తే మూడోవంతు కంటే తక్కువ మొత్తానికి (రూ.7000 కోట్లకు) వ్యాపారాలను అప్పగించాలంటూ అమెజాన్‌ సంబంధిత సంస్థ చేసిన ఆఫర్‌ను ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లు  తిరస్కరించారు.

దేశంలోనే అతి పెద్ద రెండో రిటైలర్‌ అయిన ఫ్యూచర్‌ రిటైల్‌  ‘బిగ్‌ బజార్‌, ఈజీడే, హెరిటేజ్‌’ తదితర బ్రాండ్‌ గొలుసుకట్టు విక్రయశాలలను నిర్వహిస్తోంది. గత డిసెంబరు 31 నాటికి ఈ సంస్థ రుణదాతలకు రూ.3,494.56 కోట్ల బకాయిల్ని చెల్లించాల్సి ఉండగా, విఫలమైంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అదనంగా 30 రోజుల గడువివ్వాలని రుణ సంస్థలను కోరింది. అయినా నగదు సమకూరే పరిస్థితి లేకపోవడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రుణదాతలు తమ సంస్థను ఎగవేతదారుగా ప్రకటించకుండా అడ్డుకోవడం సహా దివాలా చర్యలకు దిగకుండా ఆపాలని కోరింది. ఇందువల్ల 25,000కు పైగా ఉద్యోగులతో పాలు వాటాదార్ల ప్రయోజనాలను కాపాడవచ్చని అభ్యర్థించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు తమ రిటైల్‌ ఆస్తులు విక్రయించేందుకు రూ.24,713 కోట్లతో చేసుకున్న ఒప్పందం అమలుకు, అమెజాన్‌తో న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని ఫ్యూచర్‌ రిటైల్‌ పేర్కొంది. ‘బకాయిలు చెల్లించడంలో విఫలమైనందున, దివాలా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ ఈ నెల 15న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రాసిన హెచ్చరిక లేఖనూ’ తన పిటిషన్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ పొందుపరచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని