
ITC: రూ.1,000 కోట్ల నకిలీ బిల్లులు..రూ.181 కోట్ల ఐటీసీ మోసం
దిల్లీ: రూ.1,000 కోట్ల నకిలీ బిల్లులు జారీ చేయడం ద్వారా, రూ.181 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసానికి పాల్పడిన ఆరోపణలపై 27 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జీఎస్టీ అధికారులు వెల్లడించారు. 12వ తరగతి వరకు చదివి అకౌంటెంటు, జీఎస్టీ కన్సల్టెంటుగా పనిచేస్తున్న ఈ వ్యక్తిని ముంబయి జోన్‌లోని పల్ఘర్ సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు అరెస్టు చేశారు. డేటా మైనింగ్, డేటా విశ్లేషణ ఆధారంగా లభించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. నిథిలన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ నకిలీ బిల్లులు జారీ అయ్యాయని పేర్కొంది. మోసాలకు పాల్పడే నిమిత్తం ఆ అకౌంటెంట్ తన క్లయింట్లలో ఒకరి గుర్తింపును ఉపయోగించుకున్నాడని తెలిపింది. ఆ అకౌంటెంట్‌ను జీఎస్టీ అధికారులు అరెస్టు చేశాక.. రూ.1,000 కోట్లకు పైగా నకిలీ బిల్లులు జారీ చేయడం ద్వారా, రూ.181 కోట్లకు మేర ఐటీసీ మోసానికి పాల్పడిన విషయాన్ని అంగీకరించడాన్ని వెల్లడించింది. అతన్ని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి స్థానిక కోర్టు పంపింది.
Advertisement