వ్యాపారాల విభజనపై మార్చి కల్లా ప్రకటిస్తాం

కీలక వ్యాపారాలను విభజించి ప్రత్యేక నమోదిత సంస్థలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనల వివరాలను మార్చి చివరికల్లా ప్రకటిస్తామని వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

Published : 27 Jan 2022 03:42 IST

వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌

దిల్లీ: కీలక వ్యాపారాలను విభజించి ప్రత్యేక నమోదిత సంస్థలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనల వివరాలను మార్చి చివరికల్లా ప్రకటిస్తామని వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఆయా విభాగాలకు విడిగా విలువను సృష్టించే నిమిత్తం కార్పొరేట్‌ వ్యవస్థను సరళీకరించి, సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే జింక్‌ వ్యాపారానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదిత అనుబంధ సంస్థ ఉంది. అలాగే అల్యూమినియం, ఇనుము, ఉక్కు, చమురు- గ్యాస్‌ వ్యాపారాలను కూడా విభజించి, ప్రత్యేక సంస్థలుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయాలని వేదాంతా భావిస్తోంది. ఇందువల్ల వాటాదార్లకు విలువ పెరగడమే కాకుండా.. ఆయా వ్యాపార విభాగాల స్థానం మరింత బలోపేతం కానుంది. దీర్ఘకాలిక వృద్ధికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు కూడా ఇది తోడ్పడుతుందని వేదాంతా అగర్వాల్‌ తెలిపారు.  నెలన్నర రోజుల్లో లేదా మార్చి ముగిసే లోగా పూర్తి స్థాయి విభజన ప్రతిపాదనను ప్రకటిస్తామని చెప్పారు. అల్యూమినియం, ఇనుము, ఉక్కు, చమురు-గ్యాస్‌ వ్యాపారాల విభజన అవకాశాలను పరిశీలించేందుకు ఓ ఉప కమిటీని ఏర్పాటు చేసినట్లు గతేడాది నవంబరులో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. వాటాదార్ల విలువను మరింత పెంచేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాలు సహా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల పైనా బోర్డు యోచిస్తోందని వేదాంతా తెలిపింది. వ్యాపారాల విభజనతో మూడు కొత్త నమోదిత సంస్థలు ఏర్పాటవుతాయి. వేదాంతా స్థాయిలోనే ఈ మూడింటిలోనూ గ్రూపునకు వాటా ఉండనుంది. వేదాంతా, హిందుస్థాన్‌ జింక్‌కు ఈ మూడు కొత్త సంస్థలు కలిస్తే మొత్తం ఐదు నమోదిత సంస్థలు వేదాంతా రిసోర్సెస్‌ గ్రూపునకు ఉండనున్నాయి. వేదాంతా స్టాండలోన్‌ రుణాన్ని మూడు నమోదిత సంస్థలకు సమానంగా బదిలీ చేసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని