ఎయిరిండియాలో టాటా భోజనం నేటి నుంచే!

బిడ్డింగ్‌ ప్రక్రియలో ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్‌, కొన్ని విమానాల్లో మెరుగైన భోజన సదుపాయం కల్పించడం ద్వారా, ఆ సంస్థలో తన కార్యాచరణను ప్రారంభించనుందని సమాచారం.

Published : 27 Jan 2022 03:42 IST

దిల్లీ: బిడ్డింగ్‌ ప్రక్రియలో ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్‌, కొన్ని విమానాల్లో మెరుగైన భోజన సదుపాయం కల్పించడం ద్వారా, ఆ సంస్థలో తన కార్యాచరణను ప్రారంభించనుందని సమాచారం. ముంబయి నుంచి నాలుగు మార్గాల్లో గురువారం బయలుదేరే సర్వీసుల్లో ‘ప్రత్యేక భోజన సేవల’ను టాటా ప్రవేశపెట్టనుంది. ఏఐ 864 (ముంబయి-దిల్లీ), ఏఐ687 (ముంబయి-దిల్లీ), ఏఐ945 (ముంబయి-అబుదాబీ), ఏఐ639 (ముంబయి-బెంగళూరు) మార్గాల్లో ఈ భోజన సేవలు మొదలుకానున్నాయి. టాటా గ్రూప్‌ పేరు కింద ఎయిరిండియా విమానాలు గురువారం నుంచే నడవబోవని అధికారులు తెలిపారు. అంతకుముందు ‘ప్రభుత్వం గురువారం నాడే టాటా గ్రూప్‌నకు ఎయిరిండియా’ను అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కానీ తదుపరి ఈ విషయమై స్పష్టత ఇవ్వలేదు. టాటా గ్రూప్‌ పేరు మీద ఎయిరిండియా విమానాలు నడిచే తేదీని త్వరలో ఉద్యోగులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌ నుంచి ఎయిరిండియాను తీసుకున్న 69 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సంస్థకే ప్రభుత్వం అప్పగించనుంది. ప్రభుత్వం నిర్వహించిన వేలం ప్రక్రియ ద్వారా ఎయిరిండియాను టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గతేడాది అక్టోబరు 8న రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

ఎయిరిండియా నుంచి ఎల్‌ఐసీ నిష్క్రమణ: ఎయిరిండియా రుణ సాధనాల్లో పెట్టిన మొత్తం పెట్టుబడులను ఎల్‌ఐసీ విక్రయించేసింది. ఎయిరిండియాను టాటాలకు అప్పగించడానికి ముందే ఎల్‌ఐసీ బయటకు వచ్చింది. ఎయిరిండియా రుణసాధనాల్లో ఎల్‌ఐసీ రూ.3000 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. మొత్తం వాటాను రూ.3800 కోట్లకు విక్రయించి లాభంతో బయటకు వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా ప్రైవేట్‌ కంపెనీగా మారనున్నందున, ఇకపై ఆ సంస్థలో ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టదని వెల్లడించాయి. ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ కలిగిన ఎయిరిండియా రుణాలకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఎయిరిండియా రుణాల్లో అధికం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఇచ్చినవే. ఈ డిబెంచర్లపై 9- 10.5 శాతం మధ్య ఎయిరిండియా వడ్డీ చెల్లిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని