Published : 27 Jan 2022 03:43 IST

మీడియాలోనూ రిలయన్స్‌ సంచలనాలు!

వయాకామ్‌ 18లోకి రూ.12,000 కోట్లకు పైగా సమీకరించే ప్రణాళిక

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లకు పోటీ

దిల్లీ: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ద్వారా డిజిటల్‌ సేవల వ్యాపారాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చూశాం. ఇప్పుడు అదే తరహాలో మీడియా వ్యాపారంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. ద్విముఖ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా బ్రాడ్‌కాస్టింగ్‌ - డిజిటల్‌ విభాగాల్లో దూసుకెళ్లాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తోందని తెలిపింది. ముఖ్యంగా చందా చెల్లించడం ద్వారా కావాల్సిన వీడియోలను (ఎస్‌వీఓడీ) వీక్షించే సేవలకు గిరాకీ అంతకంతకూ పెరుగుతున్నందున, ఈ విభాగంలో సత్తా చాటాలని చూస్తోంది.

ఇందులో భాగంగా వయాకామ్‌ 18 సంస్థలోకి దిగ్గజ పెట్టుబడుదార్లను ఆహ్వానించడంతో పాటు  రూ.12,000 కోట్లకు పైగా సమీకరించాలన్నది సంస్థ ప్రణాళికగా చెబుతున్నారు. రిలయన్స్‌ కేపిటల్‌ కూడా కొంత పెట్టుబడి పెడుతుంది. స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియా మాజీ ఛైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌తో పాటు జేమ్స్‌ మర్డోఖ్‌ను వయాకామ్‌ 18లో వ్యూహాత్మక భాగస్వాములుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నియమించుకుంది. మీడియా వ్యాపార వృద్ధిలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భారీ పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వాముల సహకారంతో పోటీ సంస్థలైన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌తో పోటీపడగలమన్నది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అంచనా.

* ఇప్పటికే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియాలు విలీనమై, వీక్షణదారుల పరంగా దేశంలో అతిపెద్ద వినోద సంస్థగా అవతరించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్‌ కూడా ఈ రంగంపై దృష్టి నిలిపిందనే వార్త ఆసక్తి రేపుతోంది. 

వయాకామ్‌ 18 ఇలా..
వయాకామ్‌ 18.. రిలయన్స్‌కు చెందిన నెట్‌వర్క్‌ 18, వయాకామ్‌సీబీఎస్‌ల సంయుక్త సంస్థ. ఇందులో నెట్‌వర్క్‌ 18కు 51 శాతం, వయాకామ్‌ సీబీఎస్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. భవిష్యత్తులో వయాకామ్‌ వాటా తగ్గి రిలయన్స్‌ అతిపెద్ద వాటాదారుగా అవతరిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వయాకామ్‌18.. ఎంటీవీ, వీహెచ్‌1, కామెడీ సెంట్రల్‌తో పాటు కలర్స్‌ బ్రాండుపై వివిధ భాషల్లో టీవీ ఛానళ్లను నిర్వహిస్తోంది. వూట్‌ బ్రాండుపై వీడియో స్ట్రీమ్‌ సేవలనూ అందిస్తోంది. వయాకామ్‌ 18.. మొత్తం 53 వినోద ఛానళ్లను నిర్వహిస్తోంది. అలాగే రోజుకు 60 కోట్ల మందికి వినోద సేవలు అందిస్తోందని అంచనా.

ఎస్‌వీఓడీ విపణిలో తీవ్ర పోటీ..
సబ్‌స్క్రిప్షన్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌ (ఎస్‌వీఓడీ) విపణిలో ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది. మీడియా పార్ట్‌నర్స్‌ ఆసియా నివేదిక ప్రకారం.. ఎస్‌వీఓడీ విపణిలో డిస్నీ+హాట్‌స్టార్‌కు 4.6 కోట్లు, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు 2.17 కోట్లు, నెట్‌ఫ్లిక్స్‌కు 55 లక్షల మంది పెయిడ్‌ వినియోగదారులు ఉన్నారు. వయాకామ్‌ 18 కూడా వూట్‌ బ్రాండు ద్వారా ఎస్‌వీఓడీ సేవలు అందిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ అభివృద్ధికి వూట్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. క్రీడల పోర్ట్‌ఫోలియోనూ పెంచుకుంటోంది. చందాదార్లను పెంచుకునేందుకు సరైన వ్యూహంలోనూ వూట్‌ వెళ్లోందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవలే మొదటి కన్నడ వెబ్‌ సిరీస్‌ను కూడా వూట్‌ అందుబాటులోకి తెచ్చింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్