
స్విట్జర్లాండ్ కంపెనీలో టీవీఎస్‌కు మెజారిటీ వాటా
విలువ రూ.750 కోట్లు
దిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద ఇ-బైక్ కంపెనీ అయిన స్విస్ ఇ-మొబిలిటీ గ్రూప్ ఏజీ(ఎస్‌ఈఎమ్‌జీ)లో 75 శాతం వాటాను టీవీఎస్ మోటార్ కంపెనీ కొనుగోలు చేసింది. 100 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.750 కోట్లు) నగదును ఇందు కోసం వెచ్చించింది. ఐరోపాలో కార్యకలాపాలను విస్తరించడానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల నార్టన్ మోటార్‌సైకిల్స్, ఈజీఓ మూమెంట్‌లను టీవీఎస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఎస్‌ఈఎమ్‌జీలో మిగిలిన 25 శాతం వాటాను కూడా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు టీవీస్ మోటార్ కంపెనీ సంయుక్త ఎండీ సుదర్శన్ వేణు పేర్కొన్నారు. ఎస్‌ఈఎమ్‌జీకి స్విట్జర్లాండ్‌లో 38 భారీ రిటైల్ స్టోర్లున్నాయి. ఇక్కడ సిలో, సింపెల్, జెనిత్ బ్రాండ్లతో విక్రయాలు జరుపుతోంది. ఈ కంపెనీకి స్విస్ మార్కెట్లో 20 శాతం మార్కెట్ వాటా ఉండడం విశేషం. ఈ బ్రాండ్లకు ఐరోపాలోనే కాకుండా.. భారత్ వంటి ఇతర మార్కెట్లోనూ వృద్ధి చెందే సత్తా ఉందని వేణు అన్నారు.