బీమా వ్యాపారం నుంచి ఫ్యూచర్‌ గ్రూప్‌ నిష్క్రమణ

బీమా వ్యాపారం నుంచి ఫ్యూచర్‌ గ్రూప్‌ తప్పుకోనుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో 25 శాతం ఈక్విటీని సంయుక్త సంస్థ భాగస్వామి జెనరాలీకి రూ.1252.96 కోట్లకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది.

Published : 28 Jan 2022 03:14 IST

ఫ్యూచర్‌ జెనరాలీలో 25% వాటా రూ.1253 కోట్లకు విక్రయం

దిల్లీ: బీమా వ్యాపారం నుంచి ఫ్యూచర్‌ గ్రూప్‌ తప్పుకోనుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో 25 శాతం ఈక్విటీని సంయుక్త సంస్థ భాగస్వామి జెనరాలీకి రూ.1252.96 కోట్లకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల విక్రయం ద్వారా రుణభారం తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, జెనరాలీ పార్టిసిపేషన్స్‌ నెదర్లాండ్స్‌ ఎన్‌వీ (జెనరాలీ)లు సంయుక్తంగా ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి. సాధారణ బీమా రంగంలో ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. జీవిత బీమా సేవలు అందించే మరో సంయుక్త సంస్థ ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో వాటా విక్రయానికి గల అవకాశాలను సైతం ఫ్యూచర్‌ గ్రూప్‌ పరిశీలిస్తోంది. కొవిడ్‌-19 ప్రభావిత కంపెనీలకు ఇచ్చిన ఏకకాల పునర్‌వ్యవస్థీకరణ (ఓటీఆర్‌)లో భాగంగా బ్యాంకుల కన్సార్షియం, రుణదాతలతో ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఓటీఆర్‌లో భాగంగా మార్చికి దాదాపు రూ.2200 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కంపెనీ ఆస్తుల విక్రయం చేపట్టింది.

ప్రస్తుతం ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా ఇన్సూరెన్స్‌లో ఫ్యూచర్‌కు 49.91 శాతం వాటా ఉంది. జెనరాలీతో లావాదేవీ తర్వాత ఇది 24.91 శాతానికి తగ్గనుంది. ఇక 74 శాతం వాటాతో జెనరాలీ నియంత్రిత వాటాదారుగా మారనుంది. మిగతా 24.91 శాతం వాటాను కూడా జెనరాలీ కొనుగోలు చేసే సదుపాయం ఉందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఈ లావాదేవీకి నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంటుంది.

లైఫ్‌ఇన్సూరెన్స్‌ సంయుక్త సంస్థలో ఫ్యూచర్‌కు 33.29 శాతం వాటా ఉంది. 49 శాతం వాటాతో జెనరాలీ నియంత్రిత వాటాదారుగా కొనసాగుతోంది. మిగతా 16.6 శాతం వాటా ఇండస్ట్రీయల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఐఐటీఎల్‌) చేతిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని