స్కైరూట్‌కు రూ.34 కోట్లు

స్పేస్‌ టెక్నాలజీ అంకుర సంస్థ- స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ‘సిరీస్‌-బి, బ్రిడ్జ్‌ రౌండ్‌ ఫండింగ్‌’ కింద గూగుల్‌ వ్యవస్థాపక బోర్డు సభ్యుడు రామ్‌ శ్రీరామ్‌కు చెందిన షేర్‌పాలో వెంచర్స్‌తో పాటు ఇతర సంస్థలు, ఇన్వెస్టర్ల నుంచి 4.5 మిలియన్‌ డాలర్ల

Published : 28 Jan 2022 03:18 IST

పెట్టుబడిదార్లలో షేర్‌పాలో వెంచర్స్‌, వామి కేపిటల్‌, నీరజ్‌ అరోరా, అమిత్‌ సింఘాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్పేస్‌ టెక్నాలజీ అంకుర సంస్థ- స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ‘సిరీస్‌-బి, బ్రిడ్జ్‌ రౌండ్‌ ఫండింగ్‌’ కింద గూగుల్‌ వ్యవస్థాపక బోర్డు సభ్యుడు రామ్‌ శ్రీరామ్‌కు చెందిన షేర్‌పాలో వెంచర్స్‌తో పాటు ఇతర సంస్థలు, ఇన్వెస్టర్ల నుంచి 4.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.34 కోట్లు) పెట్టుబడి సమీకరించింది. వామి కేపిటల్‌తో పాటు నీరజ్‌ అరోరా, అమిత్‌ సింఘాల్‌ ఇందులో ఉన్నారు. రాకెట్లను ప్రయోగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోడానికి ఈ నిధులు వెచ్చించనున్నట్లు స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వెల్లడించింది. తన తొలి రాకెట్‌ ప్రయోగాన్ని ఈ ఏడాదిలో చేపట్టడానికి ఈ సంస్థ సన్నద్ధమవుతోంది. రామ్‌ శ్రీరామ్‌ వంటి ఎంతో  పేరున్న ఇన్వెస్టర్లతో మా ప్రయాణం సరైన దారిలో సాగుతోందని స్పష్టమవుతోందని స్కైరూట్‌ సీఈఓ పవన్‌ కుమార్‌ చందన వివరించారు. గత ఏడాదిలో స్కైరూట్‌ ‘సిరీస్‌-ఏ రౌండ్‌ ఫండింగ్‌’ కింద 11 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. అంతకు ముందు సీడ్‌ రౌండ్లో ‘మింత్ర’ వ్యవస్థాపకుడైన ముఖేష్‌ బన్సల్‌ ఈ సంస్థకు 1.5 మిలియన్‌ డాలర్లు ఇచ్చారు. దీంతో స్కైరూట్‌ ఇప్పటి వరకూ మొత్తం 17 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.130 కోట్లు) సమీకరించినట్లు అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని