ఆర్‌బీఐ ‘ధోరణి’ మెరుగ్గానే పనిచేసింది

‘ఆర్‌బీఐ సరైన దిశలోనే పయనిస్తోంది. సర్దుబాటు ధోరణి వల్ల మెరుగైన ఫలితాలే అందాయ’ని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే సర్దుబాటు ధోరణిని ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తూ

Published : 29 Jan 2022 03:26 IST

డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర

ముంబయి: ‘ఆర్‌బీఐ సరైన దిశలోనే పయనిస్తోంది. సర్దుబాటు ధోరణి వల్ల మెరుగైన ఫలితాలే అందాయ’ని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే సర్దుబాటు ధోరణిని ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తూ ఆర్‌బీఐ ‘వెనకబడింద’ని వస్తున్న విమర్శలపై పై విధంగా స్పందించారు. ‘ఇతర దేశాలతో పోలిస్తే భవిష్యత్‌ కరోనా దశ(వేవ్స్‌)లతోనూ పోరాడడానికి భారత్‌ అత్యంత సిద్ధంగా ఉంది. తొలి దశలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అనంతరం ఏర్పడిన అధ్వాన పరిస్థితులతో పోలిస్తే ఇపుడు బలంగా ఉన్నాం. ముడి చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని గుర్తుంచుకోవాల’ని శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన వివరించారు. ద్రవ్యోల్బణం అధికమవుతున్నా, జీడీపీ వృద్ధికి ఊతమిచ్చే సర్దుబాటు ధోరణిని కొనసాగిస్తూ ఇతర దేశాలతో పోలిస్తే  కొద్ది త్రైమాసికాలుగా ఆర్‌బీఐ ‘వెనకబడింద’(బిహైండ్‌ ద కర్వ్‌)ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా వరకు దేశాలు రేట్లను కఠితరం చేసిన అంశాన్ని విమర్శకులు పేర్కొంటున్నారు. ఆర్‌బీఐ ఈ తరుణంలో తన ధోరణిని ‘తటస్థం’నకు మార్చాలని వాళ్లు అంటున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ సమర్పించనున్న తరుణంలో ఈ విమర్శలు రావడం గమనార్హం. ‘కరోనా వచ్చినప్పటి నుంచీ ఆర్‌బీఐ 100కు పైగా సంప్రదాయ, సంప్రదాయేతర చర్యలు చేపట్టింది. కరోనాకు ముందే ఆర్థిక వ్యవస్థ దశాబ్దపు కనిష్ఠాన్ని చేరింది. అందువల్లే ఫిబ్రవరి 2019లో సర్దుబాటు ధోరణికి ఎమ్‌పీసీ వెళ్లాల్సి వచ్చింద’ని మైఖేల్‌ పాత్ర వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని