
Updated : 29 Jan 2022 10:00 IST
Toyota:కోటి కార్లు విక్రయించిన టయోటా
ప్రపంచంలోనే అగ్రస్థానం
దిల్లీ: గతేడాది కోటికి పైగా కార్లు విక్రయించి, వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ అగ్రస్థానంలో నిలిచినట్లు జపాన్ వాహన దిగ్గజం టయోటా మోటార్ కంపెనీ ప్రకటించింది. 2020తో పోలిస్తే 2021లో వాహన విక్రయాలు 10.1 శాతం పెరిగి 1.05 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. టయోటా అనుబంధ దైహిత్సు మోటార్స్, హినో మోటార్స్ విక్రయాలు కూడా ఇందులో ఉన్నాయి. జర్మనీకి చెందిన పోటీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఏజీ 2021లో 89 లక్షల వాహనాలు విక్రయించింది. 2020 అమ్మకాలతో పోలిస్తే ఇవి 5 శాతం తక్కువ కాగా.. 10 ఏళ్లలోనే సంస్థకు అత్యల్ప విక్రయాలు కావడం గమనార్హం. కరోనా సంక్షోభం వల్ల ఎదురైన సరఫరా సమస్యలకు తోడు సెమీకండక్టర్ల కొరత వల్ల కార్ల సంస్థలు ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వచ్చింది. ఐరోపాతో పోలిస్తే ఆసియా, జపాన్ విపణులపై ఈ ప్రభావం తక్కువగా ఉండటం టయోటాకు కలిసొచ్చింది.
Tags :