ఎయిర్‌టెల్‌లో గూగుల్‌కు వాటా

భారతీ ఎయిర్‌టెల్‌లో అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7500 కోట్ల) పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 1.28 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పాటు సంస్థ ప్రణాళికల్లో

Published : 29 Jan 2022 03:46 IST

రూ.7,500 కోట్ల పెట్టుబడి

కంపెనీ విలువ రూ.4.1 లక్షల కోట్లు

5జీ ప్రణాళికలు, తక్కువధర స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణకు సహకారం

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7500 కోట్ల) పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 1.28 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పాటు సంస్థ ప్రణాళికల్లో పాలుపంచుకోనుందని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఆల్ఫాబెట్‌ ఇంక్‌కు చెందిన గూగుల్‌.. భారతీ ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం వాటా కొనుగోలు నిమిత్తం ఒక్కో షేరుకు రూ.734 చొప్పున మొత్తం 700 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5,250 కోట్లు) చెల్లిస్తుంది. ఇందు కోసం రూ.5 ముఖ విలువ గల 71,176,839 షేర్లను గూగుల్‌ ఇంటర్నేషనల్‌ ఎల్‌ఎల్‌సీకి జారీ చేయడానికి ఎయిర్‌టెల్‌ బోర్డు అంగీకరించింది. ఎయిర్‌టెల్‌ తన వినియోగదార్లకు ఆఫర్‌ చేసే ఫోన్లతో పాటు ఇతర వాణిజ్య ఒప్పందాల అమలుకు మిగతా 300 మిలియన్‌ డాలర్లను వినియోగిస్తుంది. వినియోగదార్లకు కస్టమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌తో స్మార్ట్‌ఫోన్లను అందించడానికి ఎయిర్‌టెల్‌కు వీలు కలగనుంది.  ఇందుకోసం హార్డ్‌వేర్‌ భాగస్వామ్యాలనూ కుదుర్చుకోవాల్సి రావొచ్చు.

జియో తర్వాత.. భారత్‌లో 5-7 ఏళ్లలో ‘ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌’ ద్వారా 10 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.75,000 కోట్లు) పెట్టుబడులు పెడతామని రెండేళ్ల కిందట గూగుల్‌ ప్రకటించింది. అందులో భాగంగానే 2020 జులైలో ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.73 శాతం వాటాను 4.5 బిలియన్‌ డాలర్ల (రూ.33,737 కోట్ల)తో కొనుగోలు చేసింది. ఆ సమయంలో జియో ప్లాట్‌ఫామ్స్‌ విలువను రూ.4.36 లక్షల కోట్లు(58.1 బి. డాలర్లు)గా లెక్కగట్టగా.. తాజాగా శుక్రవారం ప్రకటించిన 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో భారతీ ఎయిర్‌టెల్‌ ఈక్విటీ విలువ రూ.4.1 లక్షల కోట్లు(54.7 బిలియన్‌ డాలర్లు)గా లెక్కగట్టినట్లయింది. జియో బోర్డులో గూగుల్‌ సభ్యత్వం పొందడంతో పాటు జియోఫోన్‌ నెక్స్ట్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎయిర్‌టెల్‌కు ఏంటి లాభం..

గూగుల్‌ నిధుల వల్ల సునీల్‌ మిత్తల్‌కు చెందిన ఎయిర్‌టెల్‌ 5జీ ప్రణాళికలను వేగవంతం చేయడానికి వీలు కలుగుతుంది. మార్కెట్‌ దిగ్గజమైన జియోతో పోటీ పడడానికి అవకాశం కలుగుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌టెల్‌ సేవలందిస్తున్న 10 లక్షల మంది చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు గూగుల్‌ చేరువవుతుంది.
 


భారత డిజిటల్‌ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే వినూత్న ఉత్పత్తులను అందించడానికి ఎయిర్‌టెల్‌, గూగుల్‌ కలిసి పనిచేస్తాయి. మా నెట్‌వర్క్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌, పంపిణీ-చెల్లింపుల వ్యవస్థ సహకారంతో గూగుల్‌తో కలిసి పనిచేయడం ద్వారా భారత డిజిటల్‌ వ్యవస్థను మరింత విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాం.

- భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌


స్మార్ట్‌ఫోన్లను మరింతగా అందుబాటులోకి తేవడానికి; అనుసంధానతను విస్తరించడానికి వీలు కల్పించే సరికొత్త వ్యాపార నమూనాలకు మద్దతు ఇస్తాం. కంపెనీలు డిజిటల్‌కు మారే ప్రయాణంలో సహాయపడతాం. అందులో భాగంగానే ఎయిర్‌టెల్‌లో తాజాగా పెట్టుబడులు పెట్టనున్నాం.

-ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు