Union Budget-2022: కోడలు కరుణిస్తే కొత్త గూడు

కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1న రాబోతుంది. ఆర్థిక మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలమ్మ పద్దు నుంచి గృహ కొనుగోలుదారులు ఏం ఆశిస్తున్నారు? స్థిరాస్తి వర్గాలు  ఎలాంటి అంచనాలు పెట్టుకున్నాయి?

Updated : 30 Jan 2022 00:19 IST

ఈనాడు, హైదరాబాద్‌

కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1న రాబోతుంది. ఆర్థిక మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలమ్మ పద్దు నుంచి గృహ కొనుగోలుదారులు ఏం ఆశిస్తున్నారు? స్థిరాస్తి వర్గాలు  ఎలాంటి అంచనాలు పెట్టుకున్నాయి?

బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి వాసుల సొంతింటి కలను నెరవేర్చుకునేలా ప్రోత్సాహకాలు ఉండాలని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొవిడ్‌తో రెండేళ్లుగా ఒడుదొడుకులను ఎదుర్కొని నిలదొక్కుకున్న పరిస్థితుల్లో పన్ను భారాలు లేకుండా.. నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టించేలా బడ్జెట్‌ రూపకల్పన ఉండాలని అంటున్నాయి.

వడ్డీపై రూ.ఐదు లక్షల వరకు..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 24 కింద గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచాలనేది ప్రధానమైన డిమాండ్‌. ప్రస్తుతం వడ్డీరేట్లు దశాబ్ద కాలంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయి. మరోవైపు స్థిరాస్తుల ధరలు భారీ ఎత్తున పెరిగాయి. దీంతో అధిక మొత్తంలో గృహరుణాలు తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. చెల్లిస్తున్న వడ్డీ చాలా ఎక్కువగా ఉన్నా.. రూ.రెండు లక్షల వరకే మినహాయింపు వస్తోంది. పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని భారత స్థిరాస్తి అభివృద్ధి సంఘాల సమాఖ్య (క్రెడాయ్‌) ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసింది.

* గృహ రుణం తీసుకుని తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి వడ్డీ మొత్తానికి ఎలాంటి పరిమితి లేకుండా పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉండాలి.


అసలు పైన రూ.3 లక్షల దాకా..

ఆదాయపు పన్ను సెక్షన్‌ 80సీ కింద గృహ రుణం అసలు చెల్లింపులపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, పిల్లల ట్యూషన్‌ ఫీజులకు సంబంధించి పన్ను మినహాయిపులు సైతం ఇందులోకే వస్తాయి.  వాస్తవంగా సగటు వేతన జీవి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నా పైవన్నీ కలిపితే రూ.మూడు లక్షల వరకు అవుతోంది. కానీ మినహాయింపు రూ.లక్షన్నర వరకే ఉంటుంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి.


మౌలిక హోదా..

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మౌలిక సదుపాయల హోదా ఇవ్వాలని ఎంతోకాలంగా స్థిరాస్తి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మౌలిక హోదాతో ఈ రంగానికి తక్కువ వడ్డీకి రుణాల లభ్యత పెరుగుతుంది. ప్రాధాన్యరంగాల్లో ఒకటిగా గుర్తించి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ఈ బడ్జెట్‌లోనైనా దీనిపై నిర్ణయం  ఉంటుందని క్రెడాయ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


ఇతర విజ్ఞప్తులు

రూ.20 లక్షల వరకు  ఉండే వార్షిక అద్దె ఆదాయానికి పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాలి. 

స్థిరాస్తుల అమ్మకంపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిమితిని మరింత పెంచాలి.

లేబర్‌ కాంట్రాక్ట్స్‌పైన జీఎస్‌టీ 18 శాతం వసూలు చేస్తున్నారు. వీరితో కుదుర్చుకునే కాంట్రాక్ట్‌లపైన జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలి.

నిర్మాణ సామగ్రిపై జీఎస్‌టీ రేట్లు కొన్నింటిపై చాలా ఎక్కువగా ఉన్నాయి. 28 శాతం నుంచి 18 శాతం వరకు వసూలు చేస్తున్నారు. ఇదివరకు ఇన్‌ఫుట్‌ క్రెడిట్‌ ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా తీసేశారు. రేట్లు తగ్గించి హేతుబద్ధీకరించాలి.

భూయజమాని నుంచి స్థలం తీసుకుని గృహ ప్రాజెక్టులు చేపట్టేందుకు చట్టపరంగా ఉన్న అడ్డంకులను తొలగించేందుకు బడ్జెట్‌లో చర్యలు  తీసుకోవాలి.


రూ.75 లక్షల వరకు అందుబాటు..

అందుబాటు ధరల్లో ఇళ్లపై ఉన్న పరిమితులు సడలించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ విభాగంలో ఇంటి ధర గరిష్ఠంగా రూ.45 లక్షలుగా ఉంది. ఐదేళ్లుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ భూముల ధరలు పెరిగిన పరిస్థితుల్లో పరిమితిని రూ.75 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పరిమితి పెంపుతో ఈ విభాగంలో నిర్మాణాలు చేపట్టేందుకు మరింత మంది బిల్డర్లు ముందుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  అందుబాటు ఇళ్లకు సంబంధించి జీఎస్‌టీ 1 శాతం మాత్రమే ఉంది. నిర్మాణదారులకు ఐటీ చెల్లింపుల నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని