Union Budget 2022: మరో 75 యూనికార్న్‌లు సాకారమయ్యేలా..

భారత అంకుర సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. గత ఏడాదిలో రూ.2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాయి కూడా. దేశీయ అంకురాల్లో మరో 41 యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు/సుమారు రూ.7500 కోట్ల విలువైన) సంస్థలుగా మారాయి.

Updated : 30 Jan 2022 05:00 IST

అంకురాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
పన్ను మినహాయింపులు పెంచాలి
బడ్జెట్‌ 2022

ఈనాడు, హైదరాబాద్‌: భారత అంకుర సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. గత ఏడాదిలో రూ.2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాయి కూడా. దేశీయ అంకురాల్లో మరో 41 యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు/సుమారు రూ.7500 కోట్ల విలువైన) సంస్థలుగా మారాయి. ఈ ఏడాది మరో 75 అంకురాలు యూనికార్న్‌లుగా ఎదగాలనే ఆకాంక్షను వాణిజ్య మంత్రి ఇటీవల వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం సాకారం అయ్యేలా కొత్త బడ్జెట్‌ (2022-23) మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాలని అంకుర సంస్థలు కోరుతున్నాయి. దేశీయ అంకుర సంస్థలు  దాదాపు 6.6 లక్షల మందికి ప్రత్యక్షంగా మరో 34 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయని అంచనా.

* వినూత్న ఆలోచనలతో గ్రామీణ సమస్యలకు పరిష్కారం చూపే అంకురాలకు ప్రోత్సాహకాలు పెంచాలని కోరుతున్నారు.

* ‘కొవిడ్‌ సమయంలో హెల్త్‌టెక్‌ అంకురాలు ఎంతో కీలకంగా మారాయి. డిజిటల్‌ వైద్యం, టెలి మెడిసిన్‌, వ్యాక్సిన్‌ పంపిణీ ఇలా ప్రతి అంశంలోనూ ఇవి చురుగ్గా వ్యవహరించాయి. ఇలాంటి రంగాల్లో ఉన్నవాటికి పన్ను పరంగా వెసులుబాట్లు కల్పించాలి. జీఎస్‌టీ దాఖలును మరింత సులభతరం చేయాలి.

* భారత్‌లో తయారీకి ఊతమిస్తూ, ఉత్పత్తులను తయారు చేస్తున్నవాటికి జీఎస్‌టీలో స్వల్ప రేట్లను వర్తింపచేయాలి. ఎడ్యుటెక్‌, అగ్రిటెక్‌ విభాగాల సంస్థలకూ ప్రత్యేక రాయితీలను అందించాలి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని  టి-హబ్‌ సీఈఓ ఎం.శ్రీనివాసరావు కోరారు.

దేశీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు

అంకురాల్లోకి వస్తున్న పెట్టుబడుల్లో అధికం విదేశీ వెంచర్‌ క్యాపిటలిస్టులవే. స్వదేశీ పెట్టుబడిదారులు అంకురాల్లోనూ మదుపు చేసేందుకు వీలుగా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్లలాంటివి ఏర్పాటు చేయాలి. వీటిలో పెట్టుబడులకూ స్టాక్‌ మార్కెట్‌ లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ పన్ను విధానాన్ని వర్తింపచేయాలి.

* అంకురాల కోసం ప్రత్యేక ట్యాక్స్‌ కోడ్‌ రూపొందించాలనీ అంటున్నారు. ఈసాప్స్‌ను విక్రయించినప్పుడే పన్ను వర్తించేలా నిబంధన మార్చాలని అంకురాలు కోరుతున్నాయి.

* ఆవిష్కరణల కోసం చేసే పరిశోధనా వ్యయాలకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఇవ్వాలని అడుగుతున్నాయి.

మహిళా పారిశ్రామికవేత్తలకు..

‘చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆర్థిక సహాయం లభించేలా బడ్జెట్‌ ప్రతిపాదనలుండాలి. ఆరోగ్య సంరక్షణ, సేవా రంగాలకూ ప్రాధాన్యం పెంచాలి. మహిళల నేతృత్వంలోని అంకురాలకు సహాయం అందించే వ్యవస్థను రూపొందించాలి. నైపుణ్యాల శిక్షణలాంటి వాటిని పట్టించుకోవాలి’ అని వి-హబ్‌ సీఈఓ దీప్తి రావుల సూచించారు. కొవిడ్‌ పరిణామాల్లో నష్టపోయిన, మహిళలు స్థాపించిన అంకురాలకు రుణ మారటోరియం తదితర మార్గాల్లో చేయూతనివ్వాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని