Union Budget 2022: కేంద్రం తోడ్పాటు అందించేనా!

రాష్ట్రం కేంద్ర బడ్జెట్‌లో తోడ్పాటును ఆశిస్తోంది. ఏటికేడాది తెలంగాణకు పన్నుల వాటా తగ్గుతోంది.

Published : 31 Jan 2022 07:25 IST

విభజన హామీల అమలుకు ఎదురుచూపులు
అందని ఆర్థిక సంఘం సిఫారసు నిధులు
రేపటి బడ్జెట్‌పైనే సర్వత్రా ఆసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం కేంద్ర బడ్జెట్‌లో తోడ్పాటును ఆశిస్తోంది. ఏటికేడాది తెలంగాణకు పన్నుల వాటా తగ్గుతోంది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌దీ అదే పరిస్థితి. మరోపక్క విభజన హామీలు, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలవడం లేదు. ఈ నేపథ్యంలో.. మంగళవారం కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. 75 శాతం దాకా స్వీయ రాబడులతో ముందుకు వెళ్తున్న రాష్ట్రానికి ప్రత్యేక తోడ్పాటును అందించాలని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల వాటా రూ.13,990 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. రూ.8,721 కోట్లకు తగ్గింది. అందులో ఇప్పటివరకు రూ.7,558 కోట్లు అందింది. మార్చి నెల పన్నుల వాటా ఇంకా రావాల్సి ఉంది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో కేంద్రం నుంచి రూ.38,669 కోట్లు వస్తుందని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. నవంబరు దాకా రూ.5,689 కోట్లు మాత్రమే వచ్చింది. గతేడాది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ.15,471 కోట్లు అందగా ఈసారి ఆ మొత్తమైనా అందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక తోడ్పాటు అందలేదు. తెలంగాణకు ప్రత్యేకంగా నిధులివ్వాలని 15వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌ చేసిన సిఫారసులను పట్టించుకోకపోగా.. పరిశీలనకే పరిమితం చేసింది.

అమలు కాని ఆర్థిక సంఘం సిఫారసులు

మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ.2350 కోట్లను 15వ ఆర్థికసంఘం ప్రతిపాదించింది. హైదరాబాద్‌కు ఘనవ్యర్థాలు.. వాయుకాలుష్యం నిర్వహణ నేపథ్యంలో అయిదేళ్లకు రూ.1939 కోట్లను ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. వైద్య, ఆరోగ్యానికి రూ.624 కోట్లు, పీఎంజీఎస్‌వైకు రూ.255 కోట్లు, వ్యవసాయాభివృద్ధికి రూ.1665 కోట్లు, న్యాయవ్యవస్థకు రూ.245 కోట్లు, ఉన్నతవిద్యకు రూ.189 కోట్లతో పాటు రాష్ట్ర ప్రత్యేక నిధులు రూ.2,362 కోట్లను సిఫారసు చేసినా కేంద్రం ఆమోదించలేదు.

ఈసారైనా విన్నపాలు వింటారా?

గతానుభవాల దృష్ట్యా ఈ సారి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది. పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రీబడ్జెట్‌ సమావేశం సందర్భంగా కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.30,751 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రెండేళ్ల బకాయిలను చెల్లించాలని కోరారు. నీతిఆయోగ్‌ సిఫారసుల మేరకు రూ.24,205 కోట్లను విడుదల చేయాలన్నారు. కేంద్రం ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి నిధులివ్వాలని అడిగారు. కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం, కొత్త జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయాల మంజూరు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ వంటి హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రానున్న బడ్జెట్‌లో పురపాలన, పట్టణాభివృద్ధికి రూ.7778 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. పురపాలకశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా నిధుల తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఎమ్మార్‌టీఎస్‌) ప్రాజెక్టుకు, హైదరాబాద్‌ రోడ్ల అభివృద్ధికి, స్కైవాక్‌ల నిర్మాణం, ఇతర రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, సహా రెండో దశ ఎస్‌ఆర్‌డీపీ, మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి, వరంగల్‌ మెట్రో నియో ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేటీఆర్‌ కేంద్రానికి విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు