Union Budget 2022: పన్ను పరిధిలోకి క్రిప్టో కరెన్సీ

క్రిప్టో కరెన్సీలు, ఇతరత్రా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌ ద్వారా కొంత స్పష్టత ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా

Updated : 30 Jul 2022 16:42 IST

30 శాతం విధిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదన
డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 1 శాతం టీడీఎస్‌
ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి
ఆర్‌బీఐ నుంచి త్వరలో డిజిటల్‌ కరెన్సీ
ఈనాడు - హైదరాబాద్‌

క్రిప్టో కరెన్సీలు, ఇతరత్రా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌ ద్వారా కొంత స్పష్టత ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాల మీద 30 శాతం పన్ను విధించడంతో పాటు, ఒక పరిమితికి మించిన వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 1 శాతం టీడీఎస్‌ (మూలంలో పన్ను కోత) వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. క్రిప్టో ఆదాయాలను, వాటిపై వచ్చిన నష్టాలతో సర్దుబాటు చేయటానికి వీల్లేదు. అదేవిధంగా షేర్లు, కమొడిటీల వంటి ఇతర ఆస్తులపై వచ్చిన నష్టాలతోనూ సర్దుబాటు చేయలేరు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి.

మనదేశంలో క్రిప్టో వంటి వర్చువల్‌ కరెన్సీల లావాదేవీలను అనుమతించాలా, వద్దా.. అనే విషయంలో కొంతకాలంగా పెద్దఎత్తున చర్చలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక  చట్టాన్ని తీసుకువచ్చే ఆలోచన చేసింది. అదే సమయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు కూడా వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించాలనే ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. దానికి తగ్గట్లుగానే వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులను పన్ను పరిధిలోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తద్వారా  క్రిప్టో కరెన్సీకి, ఇతర వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు ప్రభుత్వం పరోక్షంగా ఆమోద ముద్ర వేసినట్లు అవుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

మూడు రకాలు
ప్రస్తుతం మూడు రకాల వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులు కనిపిస్తున్నాయి. ఇందులో బిట్‌కాయిన్‌, ఎథేరియమ్‌, కార్డనో, అవలాంచీ వంటి ప్రైవేటు బిట్‌కాయిన్లు, ఎన్‌ఎఫ్‌టీ లు (నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు), ప్రభుత్వాలు జారీ చేసే డిజిటల్‌ కరెన్సీలు ఉన్నాయి.
* కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లకు భారీగా ఆదరణ లభిస్తోంది. దీంతో వందల సంఖ్యలో క్రిప్టో కరెన్సీ, టోకెన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లావాదేవీలపై ఇప్పటివరకు ప్రభుత్వ నియంత్రణ లేదు. 

సొంత డిజిటల్‌ కరెన్సీ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన సొంత డిజిటల్‌ కరెన్సీని సీబీడీసీ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ) పేరుతో 2022-23లో ప్రవేశపెట్టబోతోంది. ‘బ్లాక్‌చైన్‌’ ఆధారిత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆర్థిక మంత్రి వివరించారు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న బిట్‌కాయిన్‌, ఎథేరియం వంటి క్రిప్టో ఆస్తులకు, భారత రిజర్వు బ్యాంకు ఆవిష్కరించే సీబీడీసీ కి మధ్య తేడా ఉంది. బిట్‌కాయిన్‌, ఇతర క్రిప్టో కాయిన్లు/ కరెన్సీ పూర్తిగా ప్రైవేటు కాయిన్లు. నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు కూడా అంతే. కానీ సీబీడీసీ మాత్రం ప్రభుత్వ మద్దతు గల వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీ. దీన్ని ఆర్‌బీఐ పంపిణీ చేస్తుంది. అంటే దీనికి ప్రభుత్వ అనుమతితో పాటు పర్యవేక్షణ ఉంటుంది. దీని విలువలో తక్కువ హెచ్చుతగ్గులు ఉండటంతో పాటు,  ప్రభుత్వ మద్దతు కల అత్యంత భద్రమైన డిజిటల్‌ ఆస్తిగా ఉంటుంది. ఇప్పటి వరకు బహమాస్‌, నైజీరియా, ఆంటిగ్వా, క్రెనడా.. తదితర దేశాల కేంద్ర బ్యాంకులు సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని విడుదల చేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని