విద్యుత్‌ కార్ల రేసులో గెలిచేదెవ్వరు?

భవిష్యత్‌లో వాహన పరిశ్రమలో విద్యుత్‌ వాహనా(ఈవీ)లదే పైచేయిగా మారుతుందనే అంచనాలున్నాయి. ఆ రేసులో అంతర్జాతీయ స్థాయిలో ఎవరు ఆధిపత్యం సాధిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది.

Published : 06 Feb 2022 02:16 IST

టెస్లాతో పోటీకి టయోటా, ఫోక్స్‌వ్యాగన్‌ సై
పెట్టుబడులు లక్షల కోట్లలో
దశాబ్దం చివరికి ఈ రంగంలో పెను మార్పులు

భవిష్యత్‌లో వాహన పరిశ్రమలో విద్యుత్‌ వాహనా(ఈవీ)లదే పైచేయిగా మారుతుందనే అంచనాలున్నాయి. ఆ రేసులో అంతర్జాతీయ స్థాయిలో ఎవరు ఆధిపత్యం సాధిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. పూర్తి స్థాయి ఈవీ విక్రయాల్లో టెస్లాకు ఫోక్స్‌ వ్యాగన్‌, టయోటా మోటార్‌ కార్ప్‌లు గట్టి పోటీనివ్వబోతున్నాయి. భవిష్యత్‌ కోసం ఇప్పటి నుంచి భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

ఈనాడు వాణిజ్య విభాగం: విద్యుత్‌ కార్ల విషయంలో తొలి అడుగు వేసి రేసును మొదలుపెట్టింది టెస్లానే. ప్రారంభం నుంచీ దూకుడుగానే వెళుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీదార్లయిన ఫోక్స్‌వ్యాగన్‌, టయోటాలు కూడా రాబోతున్నది విద్యుత్‌ వాహన తరమే అని గమనించి, వేగంగా అడుగులు వేస్తున్నాయి. గతేడాది ఎలాన్‌మస్క్‌ విక్రయించిన ప్రతి కారుకు ఈ రెండు కంపెనీలు 10 లేదా 11 చొప్పున అమ్మకాలు సాధించినప్పటికీ.. విద్యుత్‌ కార్ల విషయంలోనూ ముందడుగు వేయాలని అనుకుంటున్నాయి. ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో పరిశ్రమను శాసించడానికి ప్రణాళికలను సైతం ప్రకటించాయి. 170 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.12.75 లక్షల కోట్లు)కు పైగా పెట్టుబడులకు సిద్ధమన్నాయి. అయితే పెట్రో ఇంధనాలతో నడిచే ఇంటర్నర్‌ కంబషన్‌ ఇంజిన్‌ను ఒక్కసారిగా బ్యాటరీ ఇంజిన్‌గా మార్చడం అంత సులువుకాదని తెలుసు. అందులోనూ టెస్లా అత్యంత విలువైన వాహన తయారీదారుగా మారిన నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌కు ఉన్న ప్రయోజనాలను దాటి, ఆ కంపెనీ మార్కెట్‌ విలువను అధిగమించి.. రేసులో ముందుకు ఎలా వెళతాయన్నదే అసలు ప్రశ్న.


ఫోక్స్‌వ్యాగన్‌ బలాలివీ..

మస్క్‌తో గట్టిపోటీ ఇచ్చే కంపెనీగా ఫోక్స్‌వ్యాగన్‌ పేరు వినవస్తోంది. గత 84 ఏళ్లలో డజనుకు పైగా బ్రాండ్లు, ప్రపంచవ్యాప్తంగా 120 తయారీ ప్లాంట్లు, డెట్రాయిట్‌ జనాభా కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఈ కంపెనీ ఎదిగింది. టైగ్వాన్‌, పాసత్‌, లంబోర్గిని, స్కానియా వంటి బ్రాండ్ల సహకారంతో ఏడాదికి 280 బి.డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. 2021లో ఈ కంపెనీ 3,22,000 పూర్తి స్థాయి విద్యుత్‌ వాహనాలను డెలివరీ చేసింది. ప్రతీ ఏటా 4,50,000 వాహనాలను విక్రయించగలదని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ ఖరీదుండే ఈవీ మోడళ్లకు మంచి ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ హెర్బర్ట్‌ డీస్‌ వచ్చే అయిదేళ్లలో కంపెనీ ఈవీలపై 89 బి.యూరోల(100 బి.డాలర్లు) పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.


అంచనా కంటే వేగంగానే ప్రయాణం

ప్రపంచంలోనే రెండు అతిపెద్ద కార్ల కంపెనీలు పూర్తిగా విద్యుత్‌ కార్ల వైపు మళ్లాలని భావిస్తే ఇక ఊహాగానాలకు తెరపడినట్లేనని ఆస్టన్‌ మార్టిన్‌ మాజీ అధిపతి, నిస్సాన్‌ మోటార్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ యాండీ పామర్‌ అంటున్నారు. నిస్సాన్‌ ‘లీఫ్‌’ తయారీలో కీలక పాత్ర వహించిన ఈయనను విద్యుత్‌ వాహనాల పితామహుడిగా పిలుస్తుంటరు. ‘అందరూ అంచనా వేసినదాని కంటే వేగంగానే విద్యుత్‌ కార్ల వైపు పరిశ్రమ మళ్లుతుంద’ని ఆయన అంచనా వేస్తున్నారు.


టయోటా నుంచి 30 ఈవీలు

టయోటా తన భవిష్యత్‌ రేసుకు అడుగులు కొన్ని నెలల కిందటే వేసింది. బీజెడ్‌4ఎక్స్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. అనిశ్చిత పరిస్థితుల్లో మరిన్ని అవకాశాల వైపు చూడాల్సి ఉంటుందని టయోటా స్పష్టం చేసింది. అయితే రేసులో కాస్త ఆలస్యంగా చేరిందనే చెప్పాలి. తన తొలి మాస్‌ మార్కెట్‌ అంతర్జాతీయ ఈవీని గత ఏడాది మధ్యకు కానీ తీసుకురాలేకపోయింది. కానీ ఆ తర్వాత ‘టయోడా’ హైడ్రోజన్‌ కారుతో అందరినీ తన వైపునకు తిప్పుకునేలా చేసుకుంది. అన్నిటి కంటే మించి ఈ దశాబ్దం చివరి కల్లా 30 విద్యుత్‌ వాహనాలతో వస్తామని ఇటీవలే ప్రకటించింది. అందులో సగం పూర్తిగా విద్యుత్‌ వాహనాలని తెలిపింది. 8 లక్షల కోట్ల యెన్‌(70 బిలియన్‌ డాలర్లు)ల పెట్టుబడులను ప్రకటించింది. దశాబ్దం చివరకు ఏటా 35 లక్షల ఈవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడు నెలల కిందట నిర్దేశించుకున్న లక్ష్యంతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం విశేషం.


టెస్లా వాటా తగ్గుతుందా?

2021లో టెస్లా 9,36,000 వాహనాలను డెలివరీ చేసింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 90 శాతం అధికం. అందుకే షాంఘై ప్లాంటుపై మరో 1.2 బి.యువాన్ల(188 మి. డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. రెండు కొత్త అసెంబ్లీ ప్లాంట్లు(బెర్లిన్‌, టెక్సాస్‌) కూడా మోడల్‌ వైఎస్‌ తయారీకి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి గిరాకీ తగ్గట్లుగా ఈవీలను ఉత్పత్తి చేస్తున్న టెస్లా రాణించగలదనే కొంత మంది విశ్లేషకులు అంటుండగా.. మరికొంత మంది మాత్రం అమెరికాలో టెస్లా ఈవీ మార్కెట్‌ 2025 కల్లా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ.. టెస్లాకు గట్టిపోటీ ఇవ్వాలంటే మాత్రం ఇతర కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ విషయంలోనూ టెస్లాను ఓడించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని