3 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు ఆవిరి

అమ్మకాలు పోటెత్తడంతో మార్కెట్లు ‘మండే’పోయాయి. ద్రవ్యోల్బణం కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచగా.. మంగళవారం నుంచి జరిగే సమీక్షలో ఆర్‌బీఐ అదే తరహా నిర్ణయం తీసుకోవచ్చనే ఆందోళనతో మదుపర్లు అమ్మకాలకు

Published : 08 Feb 2022 03:16 IST

మార్కెట్లకు రేట్ల పెంపు భయాలు
58,000 దిగువకు సెన్సెక్స్‌
సమీక్ష

మ్మకాలు పోటెత్తడంతో మార్కెట్లు ‘మండే’పోయాయి. ద్రవ్యోల్బణం కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచగా.. మంగళవారం నుంచి జరిగే సమీక్షలో ఆర్‌బీఐ అదే తరహా నిర్ణయం తీసుకోవచ్చనే ఆందోళనతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడమూ సూచీలపై ఒత్తిడి పెంచింది. సెన్సెక్స్‌ 58,000 పాయింట్ల దిగువకు చేరగా.. నిఫ్టీ 17,250 కిందకు పడిపోయింది. ఆసియా మార్కెట్లలో.. టోక్యో, సియోల్‌ నష్టపోగా, హాంకాంగ్‌, షాంఘై లాభపడ్డాయి.

సూచీల క్షీణత నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత మూడు ట్రేడింగ్‌ రోజుల్లో     రూ.5.82 లక్షల కోట్లు తగ్గి రూ.264.82 లక్షల కోట్లకు దిగి వచ్చింది.
నీసెన్సెక్స్‌ ఉదయం 58,549.67 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో 58,707.76 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీకి అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు తీవ్రం కావడంతో 57,299.05 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 1023.63 పాయింట్ల నష్టంతో 57,621.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 302.70 పాయింట్లు క్షీణించి 17,213.60 దగ్గర స్థిరపడింది.

త్రైమాసిక ఫలితాలు అంచనాలు మించడంతో ఇండిగో షేర్లు పరుగులు తీశాయి. ఇంట్రాడేలో 10.57 శాతం దూసుకెళ్లిన షేరు రూ.2183.15 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 9.91% రాణించి రూ.2170.05 దగ్గర స్థిరపడింది.

డిసెంబరు త్రైమాసికంలో నష్టం రూ.778 కోట్లకు పెరగడంతో పేటీఎం షేరు ఇంట్రాడేలో 5.69 శాతం నష్టపోయి రూ.898.95 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కోలుకుని 0.44% లాభంతో రూ.957.40 వద్ద ముగిసింది.

ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో టాటా స్టీల్‌ షేరు ఇంట్రాడేలో 3.25 శాతం పెరిగి రూ.1214.60 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 0.74 శాతం లాభంతో రూ.1184.95 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 డీలాపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.65%, ఎల్‌ అండ్‌ టీ 3.20%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.15%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.04%, హెచ్‌డీఎఫ్‌సీ 2.93%, కోటక్‌ బ్యాంక్‌ 2.92%, విప్రో 2.56%, టైటన్‌ 2.44%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.35%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.31%, హెచ్‌యూఎల్‌ 2.18%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.94% నష్టాలు నమోదుచేశాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ 1.88% వరకు పెరిగాయి.

ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌ మరణానికి సంతాపంగా సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జీ-సెక్‌లు, ఫారెక్స్‌, మనీ మార్కెట్లు పనిచేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని