చిప్పు.. చిప్పు.. నీకేమైంది చెప్పు..

కరోనా ఎపుడు మొదలైందో అప్పటి నుంచే చిప్‌ల కొరత కూడా ప్రారంభమైంది. 2020లో మొదలైన ఈ సమస్య 2022కు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలోనూ సెమీకండక్టర్ల కొరత కారణంగా ప్యాసింజరు వాహనాల విక్రయాలు క్షీణించాయి.

Published : 20 Feb 2022 04:23 IST

ఈనాడు వాణిజ్య విభాగం

కరోనా ఎపుడు మొదలైందో అప్పటి నుంచే చిప్‌ల కొరత కూడా ప్రారంభమైంది. 2020లో మొదలైన ఈ సమస్య 2022కు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలోనూ సెమీకండక్టర్ల కొరత కారణంగా ప్యాసింజరు వాహనాల విక్రయాలు క్షీణించాయి. అయితే పరిస్థితులను చక్కబెట్టడానికి భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. దేశ, విదేశీ కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడమే ఇందుకు నిదర్శనం.

వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ నుంచి ఆరోగ్యసంరక్షణ వరకు.. ఇలా అన్ని రంగాల్లోనూ మైక్రోచిప్‌లు కీలక విడిభాగాలుగా ఉంటున్నాయి. కరోనా రాకతో చాలా వరకు పనులు ఇంటి నుంచే జరిగాయి. ఆఫీసు పని, ఇతరులతో సంభాషణలు, వినోదం.. అన్నీ తెరలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చిప్‌లకు గిరాకీ పెరిగింది. సరఫరా అంతగా లేకపోవడంతో కొరత ఏర్పడింది. అంతర్జాతీయంగా ఉన్న చిప్‌ల కొరత తగ్గి.. భారత్‌లో సాధారణ పరిస్థితులకు సమీపంగా చేరడానికి 2023 వరకు సమయం పట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్‌ సమస్య ఏమిటి?: భారత్‌లో ఇప్పటిదాకా సెమీకండక్టర్ల ప్లాంటే లేదు. మనం ఎపుడూ వాటిని దిగుమతి చేసుకుంటాం. అందుకు కారణం లేకపోలేదు. తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.30,000 కోట్ల మేర భారీ పెట్టుబడులు అవసరం. అదీకాక వీటికి లాభాలు రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. అంతే కాదు.. నిరంతర విద్యుత్‌ సరఫరా; లక్షల లీటర్ల కొద్దీ స్వచ్ఛమైన నీరు అవసరం. అందుకే భారత్‌లో వీటి దిశగా అడుగులు పడలేదు.

రూ.76,000 కోట్ల పథకం: దేశంలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రూ.76,000 కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వరకు ద్రవ్య మద్దతును కేంద్రం ఇస్తుంది. అదీకాక మన దేశంలో చిప్‌ డిజైన్‌ ఇంజినీర్లకు కొరత లేదు. ఈ పరిణామాల దృష్ట్యా కంపెనీలు సైతం అవకాశం అందిపుచ్చుకుంటున్నాయి.

భారత్‌.. ఆకర్షణ మంత్రం: అంతర్జాతీయ చిప్‌ కొరతను అవకాశంగా మార్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. చైనా, తైవాన్‌, అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాలో దాదాపు ప్రపంచంలోనే సెమీకండక్టర్‌ తయారీని మొత్తం చేస్తున్నారు. అమెరికా ఇపుడు ఆ దేశం వెలుపల వీటిని తయారు చేయాలని అనుకుంటోంది. తక్కువ కార్మిక వ్యయాలుండే భారత్‌ అయితే చైనా, తైవాన్‌లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని అది భావిస్తోంది. ఇప్పటికే దేశంలో టాటా గ్రూప్‌, ఇంటెల్‌, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌లు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి.  

భారత్‌లో ఇంటెల్‌ ప్లాంటు?: ఇటీవలే ఇంటెల్‌ కొనుగోలు చేసిన ఇజ్రాయిల్‌ చిప్‌ తయారీ కంపెనీ టవర్‌ సెమీకండక్టర్‌ భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. పీఎల్‌ఐ పథకం ప్రకటించడంతో భారత్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలన్న తమ ఆలోచనకు మళ్లీ ప్రాణం వచ్చిందని ఆ కంపెనీకి సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇది కార్యరూపం దాలిస్తే పరోక్షంగా ఇంటెల్‌ భారత్‌లో ప్లాంటు ఏర్పాటు చేసినట్లు అవుతుంది.

ఎంత సమయం పట్టొచ్చు?: గిరాకీ భారీగా పెరగడంతో సరఫరా తగ్గిందని.. ప్రభుత్వం వివిధ చిప్‌ సరఫరాదార్లతో మాట్లాడుతోందని.. సమస్యను పరిష్కారించగలమని చెబుతున్నాయి. అయితే భారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తికి రెండేళ్ల తర్వాతే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 5-7 ఏళ్ల తర్వాత కానీ భారత్‌ ఒక సెమీకండక్టర్‌ డిజైన్‌ ప్రొవైడరుగా; ఇంజినీరింగ్‌ అండ్‌ ఆర్‌ అండ్‌ డీ ప్రొవైడరుగా; ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ డిజైన్‌ ప్రొవైడరుగా; ఎలక్ట్రానిక్‌ తయారీ సేవల ప్రొవైడర్‌గా మారలేదని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌ ఇటీవలే అంచనా వేశారు.


ఈ కంపెనీలు సిద్ధం

నివారం విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం.. దేశంలో ఎలక్ట్రానిక్‌ చిప్‌, డిస్‌ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అయిదు కంపెనీలు రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదనలు చేశాయి. వేదాంతా ఫాక్స్‌కాన్‌ జేవీ, ఐజీఎస్‌ఎస్‌ వెంచర్స్‌, ఐఎస్‌ఎమ్‌సీలు 13.6 బిలియన్‌ డాలర్ల(రూ.1.02 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నాయి. పీఎల్‌ఐ కింద ఇవి 5.6 బిలియన్‌ డాలర్ల(రూ.42,000 కోట్లు) మద్దతు కోరుతున్నాయి. వేదాంతా, ఎలెస్ట్‌లు 6.7 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదన(రూ.50,250 కోట్లు)తో ముందుకు వచ్చాయి. ఇవి 2.7 బి. డాలర్ల(రూ.20,250 కోట్లు) మద్దతు కోరుతున్నాయి. ఇవి కాకుండా.. ఎస్‌పీఈఎల్‌ సెమీకండక్టర్‌, హెచ్‌సీఎల్‌, సిర్మా టెక్నాలజీ, వాలెంకని ఎలక్ట్రానిక్స్‌లు సెమీకండక్టర్‌ ప్యాకేజింగ్‌ కోసం నమోదు చేసుకున్నాయి. రుత్తోన్ష ఇంటర్నేషనల్‌ రెక్టిఫైయర్‌ అయితే కాంపౌండ్‌ సెమీకండక్టర్ల కింద నమోదు చేసుకుంది. మరో మూడు కంపెనీలు(టెర్మినస్‌ సర్క్యూట్స్‌, ట్రైస్పేస్‌ టెక్నాలజీస్‌, క్యూరీ మైక్రోఎలక్ట్రానిక్స్‌) డిజైన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకున్నాయి.


1,35,000 ఉద్యోగాలు

చ్చే నాలుగేళ్లలో సెమీకండక్టర్ల కోసం ప్రకటించిన పీఎల్‌ఐ పథకం ద్వారా రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులు; 1,35,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని