Updated : 22 Feb 2022 05:10 IST

Nirmala sitaraman:బోర్డుల్లోకి మహిళలు రావట్లేదు

నేను అడిగినా ఆసక్తి చూపలేదు
బ్యాంకులు రుణ ప్రక్రియను  సులభతరం చేయాలి
అలాగని నష్టభయాన్ని పెంచుకోరాదు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబయి: కంపెనీ బోర్డుల్లో చేరడానికి మహిళలు విముఖత చూపుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అగ్రగామి 1000 కంపెనీలు కనీసం ఒక మహిళా స్వతంత్ర డైరెక్టరును కలిగి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాలా మందిని బోర్డుల్లోకి రమ్మని స్వయంగా తాను కోరినా.. ఆసక్తి చూపేవారు తక్కువగా కనిపించారని పేర్కొన్నారు. సోమవారమిక్కడ పరిశ్రమ, వృత్తినిపుణులు, పన్ను చెల్లింపుదార్లతో నిర్వహించిన బడ్జెట్‌ అనంతర సమావేశంలో ఆర్థిక మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.

* కంపెనీల బోర్డుల్లోకి సరైన సంఖ్యలో మహిళలు రావడం లేదు. కొంత మందిని బోర్డులోకి వస్తారా అని కోరాను. అయినా తగిన సంఖ్యలో వారు ముందుకు రాలేదు. అంటే ఇది తీవ్రమైన సమస్యే. ఇందుకు తగిన పరిష్కారాలతో పరిశ్రమ ముందుకు రావాలి.

బ్యాంకులు మరింత స్నేహపూర్వకంగా ఉండాలి: బ్యాంకులు వినియోగదార్లతో మరింత స్నేహపూర్వకంగా మెలగాలి. అపుడే రణస్వీకర్తలకు రుణం తీసుకునే ప్రక్రియ చాలా సులభతరమవుతుంది. అలాగని బ్యాంకులను నష్టభయంలోకి నెట్టేలా ప్రవర్తించ కూడదు.

ఆర్థిక మార్కెట్లపై మదుపర్లకు విశ్వాసం పెరగాలి: ఆర్థిక, మూలధన మార్కెట్లను మరింత బలోపేతం చేయండి. పెట్టుబడుదార్లలో ఆర్థిక మార్కెట్లపై విశ్వాసం, నమ్మకం పెరగడం అత్యంత కీలక అంశం. జాతి నిర్మాణంలో మార్కెట్‌ పెట్టుబడిదార్లకూ ప్రధాన పాత్ర ఉంది. ఆర్థిక మార్కెట్లను పెట్టుబడిదార్లకు స్నేహపూర్వకంగా ఉండేలా చేయాలి. కరోనా సమయంలో ఆర్థిక మార్కెట్లు చూపిన స్థిరత్వం ప్రశంసనీయమైనది.

‘గబ్బర్‌సింగ్‌ టాక్స్‌’ అనడం అపచారమే: జీఎస్‌టీని ప్రతిపక్షాలు ‘గబ్బర్‌సింగ్‌ టాక్స్‌’ అని అనడం దేశంలోని సంస్థలకు అపచారం చేసినట్లుగా భావించాల్సిందే. జీఎస్‌టీ మండలిలో అన్ని రాష్ట్రాలు, కేంద్రానికి భాగస్వామ్యం ఉంది. నిర్ణయాల విషయంలో కేంద్రం మూడో వంతు ప్రభావాన్ని మాత్రమే చూపగలదు. (రాహుల్‌ గాంధీ తరచుగా గబ్బర్‌సింగ్‌ టాక్స్‌ అనే పదాన్ని వాడుతుండడాన్ని ఉద్దేశించి) జీఎస్‌టీకి ఏ అజెండాతో కళంకం తీసుకురావాలని ప్రయత్నించినా.. అది అన్ని రాష్ట్రాలతో కూడిన ఒక సంస్థను అణచినట్లుగా భావించాల్సి వస్తుంది

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts