అంతర్జాతీయ విమాన ఛార్జీలు 40% వరకు తగ్గొచ్చు

కొవిడ్‌-19 ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిమిత సర్వీసులు నడిపేందుకే అనుమతి ఉండటంతో, విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే భారత్‌- అమెరికాతో పాటు మరికొన్ని మార్గాల్లో చూస్తే, కొవిడ్‌-19 ముందుతో పోలిస్తే ఛార్జీలు 100 శాతం

Published : 11 Mar 2022 05:54 IST

పరిశ్రమ వర్గాల అంచనా

27 నుంచి అన్ని సర్వీసుల పునరుద్ధరణ నేపథ్యం

భయపెడుతున్న ఏటీఎఫ్‌ ధర

కొవిడ్‌-19 ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిమిత సర్వీసులు నడిపేందుకే అనుమతి ఉండటంతో, విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే భారత్‌- అమెరికాతో పాటు మరికొన్ని మార్గాల్లో చూస్తే, కొవిడ్‌-19 ముందుతో పోలిస్తే ఛార్జీలు 100 శాతం వరకు పెరిగాయి. ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో, ఛార్జీల విషయంలో ప్రయాణికులకు ఊరట లభించే అవకాశాలున్నాయి. సర్వీసులు పెరుగుతాయి కనుక రానున్న రోజుల్లో విమాన ఛార్జీలు 40 శాతం వరకు తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. లుఫ్తాన్సా, ఆ గ్రూపునకు చెందిన స్విస్‌ సంస్థలు రాబోయే కొన్ని నెలల్లో రెట్టింపు సంఖ్యలో విమానాలు నడపాలని అనుకుంటున్నాయి. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా విమానాల సంఖ్యను 17 శాతం మేర పెంచే అవకాశం ఉంది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని నెలల్లో 100 అంతర్జాతీయ విమానాల సర్వీసులు పునరుద్ధరిస్తామని పేర్కొంది.  ప్రస్తుతం ఆయా దేశాలతో ఉన్న ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం మేరకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను విమానయాన సంస్థలు నడిపిస్తున్నాయి. సర్వీసుల పునరుద్ధరణతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తిరిగి కొవిడ్‌-19 ముందు స్థాయికి వస్తాయని భావిస్తున్నామని ఇక్సిగో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలోక్‌ వాజ్‌పేయ్‌ చెప్పారు.

విమాన ఇంధన ధరలు అడ్డుకుంటాయా?: అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో, ముడిచమురుకు అనుగుణంగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలను ఎంతవరకు తగ్గిస్తాయో వేచి చూడాలనే మాటా వినిపిస్తోంది. దేశీయంగా చూస్తే, ఈ ఏడాది ఇప్పటికే విమాన ఇంధన ధరలను ఐదు సార్లు పెంచారు. 2021లో ఏకంగా విమాన ఇంధన ధరలు 100 శాతం మేర పెరిగాయి.  యుద్ధం కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మేక్‌మైట్రిప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజేశ్‌ మాగో అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని