NSE Co Loaction Case: నేరాన్ని సెబీ అధికారులూ దాచిపెట్టారా?

ఎన్‌ఎస్‌ఈ కో-లోకేషన్‌ కేసు వ్యవహారంలో, 2016-19 మధ్య సెబీలో పనిచేసిన అధికారుల తీరుపైనా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి సారించిందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. విచారణకు

Updated : 19 Mar 2022 09:06 IST

ఎన్‌ఎస్‌ఈ కోలొకేషన్‌ కేసులో వారి పాత్రపై సీబీఐ దృష్టి

దిల్లీ: ఎన్‌ఎస్‌ఈ కో-లోకేషన్‌ కేసు వ్యవహారంలో, 2016-19 మధ్య సెబీలో పనిచేసిన అధికారుల తీరుపైనా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి సారించిందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. విచారణకు హాజరు కావాల్సిందిగా అప్పటి అధికారులకు త్వరలోనే సీబీఐ ఆదేశాలు జారీ చేయొచ్చని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో పాలనాపరమైన వైఫల్యాలు, అవకతవకలు చోటుచేసుకున్నా, నియంత్రణ సంస్థ అధికారులుగా ఆ విషయాన్ని వీళ్లు ఎందుకు బయటపెట్టలేదనే కోణంలో సీబీఐ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘ఈ పరిణామాలను సెబీ అధికారులు మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. వాళ్లు ఎక్కడా రిపోర్ట్‌ చేయకపోవడం, విజిలెన్స్‌ రికార్డుల్లోనూ నమోదు చేయకపోవడాన్ని చూస్తుంటే.. కావాలనే వాళ్లు నేరాన్ని దాచిపెట్టినట్లుగా సీబీఐ అనుమానిస్తోంద’ని ఆయా వర్గాలు తెలిపాయి. ‘ఉద్దేశపూర్వకంగా ఆ విషయాన్ని దాచిపెట్టారా.. లేక వీళ్లు కూడా ఆ నేరంలో భాగస్వాములేనా’ అనే విషయాన్ని తేల్చాలని సీబీఐ అనుకుంటోందని వివరించాయి.

ఎన్‌ఎస్‌ఈ కోలోకేషన్‌ కుంభకోణాన్ని ఓ ప్రజావేగు 2015 జనవరిలో సెబీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఎస్‌ఈలోని కొందరు అధికారులతో కుమ్మకై కొంత మంది బ్రోకర్లు స్టాక్‌ మార్కెట్‌ యాక్సెస్‌ను ఇతర బ్రోకర్ల కంటే ముందుగా పొంది, అక్రమంగా భారీ లాభాలు ఆర్జించారంటూ సెబీకి లేఖ రాశారు. ఈ వివరాలను ఆధారంగా చేసుకుని, సెబీ టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ దర్యాప్తు నిర్వహించింది. ఎన్‌ఎస్‌ఈ సర్వర్ల కో-లొకేషన్‌ వ్యవస్థలో దుర్వినియోగం జరిగినట్లుగా అప్పుడే గుర్తించారు. ఆ తర్వాత 2016 సెప్టెంబరులో ఈ ఆరోపణలపై దర్యాప్తు, ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఎన్‌ఎస్‌ఈ బోర్డును సెబీ ఆదేశించింది. ఈ పరిణామాలకు సంబంధించిన కేసులోనే ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ, మాజీ సీఓఓ ఆనంద్‌ సుబ్రమణియన్‌లను సీబీఐ విచారించడంతో పాటు దేశం విడిచి పారిపోకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసింది. గత నెలలో సుబ్రమణియన్‌ను, మార్చిలో చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని