ఇళ్ల అమ్మకాల్లో.. అందుబాటు ధర వాటా 43 శాతమే

గతేడాది జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో అందుబాటు ధర (రూ.45 లక్షల వరకు) విభాగం వాటా 43 శాతానికి తగ్గిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ ప్రాప్‌ టైగర్‌ నివేదిక పేర్కొంది. 2020లో ఈ విభాగం వాటా 48 శాతంగా...

Published : 19 Mar 2022 03:52 IST

2020లో ఇది 48%: ప్రాప్‌టైగర్‌ నివేదిక

దిల్లీ: గతేడాది జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో అందుబాటు ధర (రూ.45 లక్షల వరకు) విభాగం వాటా 43 శాతానికి తగ్గిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ ప్రాప్‌ టైగర్‌ నివేదిక పేర్కొంది. 2020లో ఈ విభాగం వాటా 48 శాతంగా ఉంది. ఇదే సమయంలో రూ.75 లక్షలకు పైబడిన ఫ్లాట్‌/ఇళ్ల విక్రయాల వాటా 25 శాతం నుంచి 31 శాతానికి చేరిందని ‘రియల్‌ ఇన్‌సైట్‌ రెసిడెన్షియల్‌- యాన్యువల్‌ రౌండప్‌ 2021’ పేరిట వెలువరించిన నివేదికలో ప్రాప్‌ టైగర్‌ పేర్కొంది. దేశంలోని 8 ప్రధాన విపణు (హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి ఎంఎంఆర్‌, పుణె)ల్లో గృహ విక్రయాలు 2020లో 1,82,639 కాగా, గతేడాది 2,05,936కు పెరిగాయని తెలిపింది.

* ఈ 8 ప్రధాన నగరాల్లో జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో రూ.45 లక్షల లోపు విభాగం వాటా 43 శాతంగా ఉంది. రూ.45-75 లక్షల మధ్య ఇళ్ల విక్రయాలు 26 శాతం నుంచి 27 శాతానికి చేరాయి. రూ.75 లక్షలు- కోటి విలువ కలిగిన ఫ్లాట్ల వాటా 9 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. రూ.కోటి పైబడిన ఇళ్ల వాటా 16 శాతం నుంచి 20 శాతానికి చేరింది.

* దేశీయంగా ప్రభుత్వం ఇస్తున్న విధానపరమైన తోడ్పాటు అందుబాటు గృహాల వైపు కొనుగోలుదార్లను నడిపిస్తోంది. తొలిసారిగా ఇంటిని (అదీ రూ.45 లక్షల లోపు) కొనుగోలు చేసేవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80ఈఈఏ కింద, రూ.1.50 లక్షల పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద సబ్సిడీ కూడా పొందొచ్చు.

* ప్రభుత్వ సబ్సిడీలతో పాటు గృహ రుణాలపై వడ్డీ రేట్లు రికార్డు కనిష్ఠానికి చేరడంతో ఇళ్ల విక్రయాలు పుంజుకున్నాయని, ఆర్థిక వ్యవస్థ రికవరీ కూడా తోడ్పడిందని హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ గ్రూప్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాలా పేర్కొన్నారు. 2022లో ఇదే జోరు కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. పన్ను మినహాయింపులు, స్టాంప్‌ డ్యూటీ రద్దు, నిర్మాణ వ్యయ పరిమితి పెంచితే అందుబాటు ధర ఇళ్లు మరింత నాణ్యతతో నిర్మించవచ్చని పేర్కొన్నారు.

నిన్న మార్కెట్లు పనిచేయలేదు

హోలీ సందర్భంగా శుక్రవారం (నిన్న) స్టాక్‌ మార్కెట్లు పనిచేయలేదు. కమొడిటీ, బులియన్‌, ఫారెక్స్‌ మార్కెట్లకు కూడా సెలవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని