గృహనిర్మాణం మరింత భారం

ఏడాదికాలంలో గృహ సముదాయ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సగటున 10-12 శాతం పెరిగిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది. వచ్చే డిసెంబరు నాటికి నిర్మాణ వ్యయం

Published : 30 Mar 2022 02:02 IST

ఏడాదిలో వ్యయం 10-12% పెరిగింది

డిసెంబరు కల్లా మరో 8-9% పైకి కొలియర్స్‌ ఇండియా నివేదిక

దిల్లీ: ఏడాదికాలంలో గృహ సముదాయ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సగటున 10-12 శాతం పెరిగిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది. వచ్చే డిసెంబరు నాటికి నిర్మాణ వ్యయం మరో 8-9 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. నిర్మాణంలో అధికంగా వినియోగించే సిమెంటు, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలు సరఫరా అవరోధాల నేపథ్యంలో, అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022 మార్చి నాటికి 20 శాతానికి పైగా పెరిగాయి. ఇంకా ధరలు పెరుగుతున్నందున, నిర్మాణదార్లు (డెవలపర్లు) కూడా ధరల వ్యూహాన్ని సమీక్షిస్తున్నారని తెలిపింది.

అందుబాటు గృహాలపై అధిక ప్రభావం
నిర్మాణ వ్యయాలు పెరగడం ‘అందుబాటు ధర, మధ్య తరహా గృహ విభాగాల’పై ఎక్కువగా ప్రభావం చూపుతుందని కొలియర్స్‌ పేర్కొంది. ఈ విభాగంలో తక్కువ మార్జిన్లతో కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే కారణంగా వివరించింది. ‘మొత్తం నిర్మాణవ్యయంలో నిర్మాణ సామగ్రి వాటా 2/3 వంతు ఉంటుంది. వీటి ధరలకు అనుగుణంగా, నిర్మాణదార్లు ఇల్లు/ఫ్లాట్‌ ధరలను పెంచేందుకు మొగ్గుచూపొచ్చ’ని కొలియర్స్‌ ఇండియా సీఈఓ రమేశ్‌ నాయర్‌ తెలిపారు. ‘టోకు ధరల ద్రవ్యోల్బణం, నిర్మాణ వ్యయాలు రెండూ రెండంకెల స్థాయిలో పెరగడంతో 2022 డిసెంబరు కల్లా నిర్మాణ వ్యయం మరో 8-9 శాతం మేర పెరుగుతుంద’ని నాయర్‌ చెప్పారు. 2021 మార్చిలో నిర్మాణ వ్యయం  చదరపు అడుగుకు సగటున రూ.2,060 ఉండగా, 2022 మార్చికి ఇది రూ.2,300కు పెరిగిందని కొలియర్స్‌ ఇండియా తెలిపింది. నిర్మాణ వ్యయం గణాంకాల్లో జీఎస్‌టీ కలిసి లేదు. 15 అంతస్తుల ఖరీదైన నివాస భవనాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యయాన్ని లెక్కగట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని