24/7 డిజిటల్‌ బ్యాంకులొస్తున్నాయ్‌

రోజంతా(24/7) డిజిటల్‌ ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల(డీబీయూ)ను ప్రస్తుత బ్యాంకులు ఆరంభించవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది.

Published : 08 Apr 2022 04:15 IST

మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్‌బీఐ

ముంబయి: రోజంతా(24/7) డిజిటల్‌ ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల(డీబీయూ)ను ప్రస్తుత బ్యాంకులు ఆరంభించవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ఇందుకోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌ అనుభవం ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు ఒకటో శ్రేణి నుంచి ఆరో శ్రేణి కేంద్రాల్లో డీబీయూలను తెరిచేందుకు అనుమతిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా 75 జిల్లాల్లో 75 డీబీయూలను ఏర్పాటు చేయబోతున్నట్లు 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఏమిటీ డీబీయూ
ఇది ఒక ప్రత్యేక వ్యాపార కేంద్రం. డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలు అందించడానికి కావలసిన కనీస డిజిటల్‌ మౌలిక వసతులు ఇందులో ఉంటాయి. డిజిటల్‌ ఆర్థిక సేవలను విస్తరించడంతో పాటు అందరికీ బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే వీటి లక్ష్యం. ఖాతా  తెరవడం, డబ్బుల విత్‌డ్రా, డిపాజిట్‌, కేవైసీ మార్పులు, రుణాలు, ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలను డీబీయూలు అందజేస్తాయి.

అనుమతులు అక్కర్లేదు
గతంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌ అనుభవం ఉన్న బ్యాంకులు విడిగా ఎటువంటి అనుమతులు అక్కర్లేకుండానే డీబీయూలను ఏర్పాటు చేయవచ్చు. బ్యాంకుల డీబీయూలను బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుత బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లలో భాగంగా కాకుండా ఇవి విడిగా ఉంటాయి. ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలుంటాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ వినియోగదార్ల అవసరాలు తీర్చే విధంగానే ఉంటాయి. వీటి కార్యకలాపాలకు బ్యాంకులు సొంత లేదా పొరుగు సేవల సిబ్బందిని వినియోగించుకోవచ్చు. ఒక వేళ పొరుగు సేవల నమూనాలో నిర్వహించాలనుకుంటే మాత్రం.. సంబంధిత నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. డీబీయూల ఏర్పాటు సదరు బ్యాంకుకు చెందిన డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యూహంలో భాగంగా ఉండాలి.

ఎవరెవరు ఉండాలంటే..
ప్రతీ డీబీయూలో బ్యాంకుకు చెందిన సీనియర్లు, అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్‌లు ఉండాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల డీబీయూల్లో అయితే స్కేల్‌ 3 లేదా అంత కంటే ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తులను; ఇతర బ్యాంకులు తత్సమాన స్థాయి వ్యక్తులను నియమించాల్సి ఉంటుంది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరు(సీఓఓ)గా నియమించదగ్గ వ్యక్తి ఉండాలి. సైబర్‌ భద్రత తగినంత ఉండాలి.

ఈ వసతులు ఉండాలి
డీబీయూలు కనీస డిజిటల్‌ ఉత్పత్తులు, సేవలను అందించాలి. డిజిటల్‌ సేవల నుంచి సంప్రదాయ ఉత్పత్తుల వరకు అన్నీ ఉండొచ్చు. డీబీయూలను విస్తరించుకోవడానికి డిజిటల్‌ బిజినెస్‌ ఫెసిలిటేటర్‌/బిజినెస్‌ కరెస్పాండెంట్లను వినియోగించుకోవచ్చు. అన్ని మార్గదర్శకాలను పాటించేలా సదరు బ్యాంకు బోర్డు ఆన్‌సైట్‌, ఆఫ్‌సైట్‌ పరిశీలన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల కీలక పనితీరు అంశాల ప్రగతిని బోర్డు లేదా కమిటీ సమీక్షించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని