రూ.1.67 లక్షల కోట్ల ఎగుమతులు

గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు రూ.1.67 లక్షల కోట్ల వరకూ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లు మాత్రమే కావటం గమనార్హం.

Published : 10 Apr 2022 02:48 IST

ఐటీ రంగంలో తెలంగాణ జోరు  
2021-22లో 15 శాతం వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు రూ.1.67 లక్షల కోట్ల వరకూ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లు మాత్రమే కావటం గమనార్హం. దీంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 15 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అవుతుంది. ఇది ఐటీ రంగ జాతీయ సగటు వృద్ధి కంటే అధికం కావటం గమనార్హం. గత కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు ఏటా రెండంకెల వృద్ధి సాధిస్తున్న విషయం విదితమే. ఇదే ఒరవడి ఇక ముందూ కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం విదితమే. అందుకు అనువైన విధానాలను ఆవిష్కరిస్తోంది. అందువల్లే ఐటీ ఎగుమతులు రాష్ట్రం నుంచి ఆకర్షణీయమైన రీతిలో పెరుగుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2026 నాటికి రాష్ట్రం నుంచి రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించాలని, 10 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ వ్యాప్త అగ్రశ్రేణి ఐటీ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌, ఐబీఎం తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. దీనికి తోడు పలు కొత్త సంస్థలు మనదేశంలో ఐటీ కార్యకలాపాల నిర్వహణకు హైదరాబాద్‌ను కేంద్ర స్థానంగా ఎంచుకుంటున్నాయి. ఇదే జోరు కొనసాగుతుందని, నిర్దేశించుకున్న విధంగా ఐటీ ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేకపోలేదని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని