ఏటా 4 లక్షల కార్ల తయారీ

దక్షిణ కొరియా సంస్థ కియా అనుబంధ కియా ఇండియా దేశీయ విపణిలో కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నెలకొల్పిన యూనిట్లో 100%

Published : 28 Apr 2022 02:19 IST

అనంతపురం యూనిట్‌ సామర్థ్యాన్ని  3 లక్షల నుంచి పెంచనున్న కియా  

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ కొరియా సంస్థ కియా అనుబంధ కియా ఇండియా దేశీయ విపణిలో కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నెలకొల్పిన యూనిట్లో 100% సామర్థ్యంతో ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశీయంగా విడుదల చేసిన ప్రతి కారు మోడల్‌, వినియోగదార్లను ఆకట్టుకోవడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం సంస్థకు కనిపించడం లేదు. కియా కొన్ని మోడల్‌ కార్లను బుక్‌ చేసుకున్న వారు, నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే అనంతపురం యూనిట్‌ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కియా ఇండియాకు మనదేశంలో ఉన్న యూనిట్‌ ఇదొక్కటే. ఏడాదికి 3 లక్షల కార్ల్ల తయారీ సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది. ప్రస్తుతం మూడు షిప్టుల్లో, 100% సామర్థ్యంతో ఇది పనిచేస్తోంది. అయినా కియా కార్లను ఎక్కువ ‘వెయిటింగ్‌’ లేకుండా వినియోగదార్లకు అందించలేకపోతున్నారు. ఆర్డర్‌ బ్యాక్‌లాగ్‌.. అంటే, డెలివరీ చేయాల్సిన కార్ల సంఖ్య పెరిగిపోతోంది. అందువల్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ సంవత్సరాంతం నాటికి ఏడాదికి 4 లక్షల కార్లకు పెంచుకోవాలని నిర్ణయించినట్లు కియా ఇండియా ఎండీ తే-జిన్‌ పార్క్‌ ఇటీవల దిల్లీలో వెల్లడించారు. దీనికి తగ్గట్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

1.25 లక్షల ఆర్డర్లు పెండింగ్‌: కియా ఇండియా  ఇటీవల ఆవిష్కరించిన కారెన్స్‌ మోడల్‌కు పెద్దఎత్తున బుకింగ్‌లు లభించాయి. ప్రస్తుతం కంపెనీ వద్ద ఆర్డర్‌ బ్యాక్‌లాగ్‌ 1,25,000 కార్లకు ఉంటే, ఇందులో సగం వరకు కియా కారెన్స్‌ బుకింగ్‌లే ఉన్నట్లు తెలుస్తోంది. సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ మోడళ్ల అమ్మకాలు సైతం ఆకర్షణీయంగా ఉన్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనంతపురం యూనిట్‌ నుంచి 5 లక్షల కార్లు ఉత్పత్తి చేసి, దేశీయ విపణికి అందించడంతో పాటు ఇందులో లక్ష కార్లను ఎగుమతి చేసింది. అతి తక్కువ సమయంలో ఈ రికార్డు అందుకున్న వాహన సంస్థగా కియా ఇండియా రికార్డు సృష్టించింది.

ఎస్‌యూవీ మోడళ్ల వల్లే: నూతన తరం వినియోగదార్లు సంప్రదాయ సెడాన్‌ కార్లకు బదులు, ఎస్‌యూవీ/ ఎంపీవీ మోడళ్లను అధికంగా ఇష్టపడుతున్నారు. సరిగ్గా ఈ మోడళ్లనే  విడుదల చేయడం కియా ఇండియాకు కలిసి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని