జోరుగా పసిడి కొనుగోళ్లు

అక్షయ తృతీయ పర్వదినాన సూర్యుడి ప్రతాపం మొదలుకాకముందే కొనుగోలుదార్లు పసిడి దుకాణాలను సందర్శించారు. మధ్యాహ్నం నెమ్మదించి తర్వాత సాయంత్రం సందడి కనిపించింది. దీంతో కొనుగోళ్లు పెరిగాయని.. కనీసం 25-30 టన్నుల

Published : 04 May 2022 03:52 IST

ముంబయి: అక్షయ తృతీయ పర్వదినాన సూర్యుడి ప్రతాపం మొదలుకాకముందే కొనుగోలుదార్లు పసిడి దుకాణాలను సందర్శించారు. మధ్యాహ్నం నెమ్మదించి తర్వాత సాయంత్రం సందడి కనిపించింది. దీంతో కొనుగోళ్లు పెరిగాయని.. కనీసం 25-30 టన్నుల వ్యాపారం జరిగినట్లు అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి అంచనా వేస్తోంది. ‘దేశవ్యాప్తంగా ఆభరణ వర్తకులు అక్షయ తృతీయ రోజున తమ స్టోర్లను త్వరగా తెరచారు. ఉదయం నుంచే సందడి కనిపించింది. గత 10-15 రోజులుగా ఉన్న సానుకూల సెంటిమెంటు అక్షయ తృతీయ రోజునా కొనసాగింద’ని ఆ మండలి వైస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ మెహ్రా పేర్కొన్నారు. రూ.55,000-58,000 స్థాయిలో ఉన్న ధరలు రూ.50,500కు దిగి రావడంతో వినియోగదారు సెంటిమెంటు మెరుగైందని ఆయన చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘ఉదయం, సాయంత్రం ప్రజలు అధికంగా వచ్చారు. ఎండలకు తోడు సెలవు రోజు కూడా కావడంతో ప్రజలు తమకు వీలైన సమయంలో పసిడి షాపులను సందర్శించార‘ని పీఎన్‌జీ జువెలర్స్‌ ఎండీ, సీఈఓ సౌరభ్‌ గాడ్గిల్‌ అన్నారు. ‘పెళ్లిళ్ల సీజనుకు తోడు అక్షయ తృతీయ కూడా కలిసిరావడంతో మార్కెట్లో సానుకూల సెంటిమెంటు కనిపించింది. ఒకప్పుడు దక్షిణ, తూర్పు భారత్‌లోనే ఎక్కువగా జరుపుకునే ఈ పండుగను ఇపుడు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత స్టోర్లు తెరచుకోవడంతో ఆఫ్‌లైన్‌ విక్రయాలే అధికంగా జరిగాయ’ని కల్యాణ్‌ జువెలర్స్‌ ఈడీ రమేశ్‌ కల్యాణరామన్‌ పేర్కొన్నారు. గిరాకీ పెరుగుతూ రావడంతో పాటు కొనుగోలు శక్తి పెరగడంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విక్రయాలు పెరిగాయని క్యారట్‌లేన్‌ సీఓఓ అవ్నిష్‌ ఆనంద్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని