రుణ రేట్లు భారమవుతున్నాయ్‌

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచడంతో, ఈ భారాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ వసూలు చేసే రెపో రేటు 4 శాతం

Published : 08 May 2022 02:50 IST

ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 40 బేసిస్‌ పాయింట్ల వరకు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచడంతో, ఈ భారాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ వసూలు చేసే రెపో రేటు 4 శాతం కొనసాగుతున్నప్పుడే పలు బ్యాంకులు మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 10-30 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచడం ప్రారంభించాయి. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆర్‌బీఐ రెపో రేటుతో పాటు నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)నీ సవరించడంతో ఇప్పుడు బ్యాంకులు తమ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లింక్డ్‌ లెండింగ్‌ రేట్లను (ఈబీఎల్‌ఎల్‌ఆర్‌) రెపో పెంపు స్థాయిలోనే పెంచుతున్నాయి. బ్యాంకులన్నీ ఈబీఎల్‌ఎల్‌ఆర్‌కు ప్రామాణికంగా రెపో రేటును పాటిస్తున్నాయి. రెపో ఆధారిత వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) లోనే రుణాలను జారీ చేస్తున్నాయి. అంటే, రెపో రేటు హెచ్చుతగ్గులు ఈ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ రెపో ఆధారిత వడ్డీ రేట్ల (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను పెంచాయి. గృహరుణ సంస్థలూ తమ రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్‌)ను సవరిస్తున్నాయి.
        

* తాజాగా కెనరా బ్యాంకు తన ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. అన్ని కాలావధులకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీంతోపాటు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను ప్రస్తుత 6.90 శాతం నుంచి 40 బేసిస్‌ పాయింట్లు పెంచి, 7.30 శాతానికి చేర్చింది.
* గృహరుణాలను అందించే హెచ్‌డీఎఫ్‌సీ కూడా తన ఆర్‌పీఎల్‌ఆర్‌ను 30 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచుతున్నట్లు, మే 9 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఫలితంగా 6.70-7.15శాతంగా ఉన్న గృహరుణాల వడ్డీ రేట్లు 7-7.45 శాతానికి చేరుతున్నాయి.
* రెపో ఆధారిత రుణరేటును ఈనెల 9 నుంచి 40 బేసిస్‌ పాయింట్ల చొప్పున పెంచుతున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది.

క్రెడిట్‌ స్కోరు బాగుంటే..
ప్రస్తుతం బ్యాంకులు గృహరుణ రేట్లను క్రెడిట్‌ స్కోరుకు ముడిపెడుతున్నాయి. సిబిల్‌ స్కోరు 750కి మించి ఉన్నప్పుడు మంచి స్కోరుగా భావిస్తాయి బ్యాంకులు. 800కు పైగా ఉంటే రుణ రేటుపై దాదాపు 25 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ ఈ తరహా రుణాలను అందిస్తోంది. గృహరుణాలకే కాకుండా, ఇతర రుణాలకూ ఇలాంటి రాయితీలను అందించే దిశగా బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. మహిళా రుణ గ్రహీతలకు పలు బ్యాంకులు ఇప్పటికే 5 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేటును తగ్గించి అందిస్తున్నాయి.

ఎఫ్‌డీల రేట్లూ..: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు గత నాలుగేళ్లుగా తక్కువ ఉండటంతో డిపాజిటర్లు ఇబ్బంది పడుతున్నారు.  బ్యాంకులు ఇప్పుడిప్పుడే ఆ రేట్లనూ పెంచడం ప్రారంభించాయి. ఎఫ్‌డీలను ఆకర్షించేందుకు బంధన్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాంటివి ఎఫ్‌డీలపై 30 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీని పెంచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని