నకిలీ ఖాతాల లెక్క తేలాకే ట్విటర్‌ కొనుగోలుపై ముందుకు

ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ మలుపులు తీసుకుంటూనే ఉంది. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఎప్పటికప్పుడు భిన్నంగా ట్వీట్లు చేస్తూ, అసలు ఈ ఒప్పందం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కలిగేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ట్విటర్‌లో స్పామ్‌

Published : 18 May 2022 02:57 IST

ఎలాన్‌ మస్క్‌

లండన్‌: ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ మలుపులు తీసుకుంటూనే ఉంది. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఎప్పటికప్పుడు భిన్నంగా ట్వీట్లు చేస్తూ, అసలు ఈ ఒప్పందం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కలిగేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ట్విటర్‌లో స్పామ్‌ (నకిలీ/మోసపూరిత) ఖాతాలు 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని బహిరంగంగా సాక్ష్యాలు చూపితే మినహా ఒప్పందం ముందుకెళ్లదని కుండబద్ధలు కొట్టారు.

పరాగ్‌ ఏమంటారంటే..

అంతకుముందు ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌తో మస్క్‌ సమావేశమయ్యారు. బాట్స్‌పై ఎంతగా  పోరాటం చేస్తోందీ వివరిస్తూ.. ట్విటర్‌ ఖాతాల్లో 5 శాతం లోపు  నకిలీవి కావొచ్చని పరాగ్‌ పలు ట్వీట్లలో వివరించారు. ‘ప్రతి త్రైమాసికంలోనూ 5 శాతం లోపు స్పామ్‌ ఖాతాలున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది. వేలకొద్దీ ఖాతాలను మనుషుల ద్వారా సమీక్షించిన అనంతరం ఈ అంచనాలకు వచ్చామ’ని అందులో వివరించారు.

మస్క్‌ ఏమంటున్నారంటే..

‘20 శాతం ఫేక్‌/స్పామ్‌ ఖాతాలుండొచ్చు. అంటే ట్విటర్‌ చెప్పేదానికంటే 4 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఎస్‌ఈసీకి ట్విటర్‌ ఇచ్చిన సమాచారం సరైనదని భావించి నేను ట్విటర్‌ కొనుగోలుకు 44 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ ప్రకటించాను. నకిలీ ఖాతాలు 5 శాతం లోపే అనడానికి ఆధారాలు చూపేందుకు ట్విటర్‌ సీఈఓ నిరాకరించారు. ఆయన బహిరంగంగా నిరూపించేంత వరకు ఈ ఒప్పందం ముందుకు వెళ్లద’ని  మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ట్విటర్‌ నిరాకరించింది. అయితే ట్విటర్‌ కోసం గత నెలలో ప్రకటించిన 44 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ ఇవ్వాలన్నది మస్క్‌ అభిమతం కావొచ్చని.. మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని