ఎల్‌ఐసీ నష్టారంభం

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) షేర్లు నష్టారంభం చేశాయి. స్టాక్‌ మార్కెట్లో నమోదైన తొలి రోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధరైన రూ.949తో పోలిస్తే రూ.81.80 తక్కువగా  రూ.867.20 వద్ద బీఎస్‌ఈలో షేరు నమోదైంది. ఇంట్రాడేలో రూ.860.10కి దిగివచ్చినా, చివరకు 7.75% (రూ.73.55) నష్టంతో రూ.875.45 వద్ద ముగిసింది. మొత్తం 27.52 లక్షల షేర్లు చేతులు మారాయి.

Published : 18 May 2022 03:05 IST

ఎక్స్ఛేంజీల్లో నమోదు రోజే 8% క్షీణించిన షేరు
మార్కెట్‌ విలువ పరంగా అయిదో స్థానం

ముంబయి: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) షేర్లు నష్టారంభం చేశాయి. స్టాక్‌ మార్కెట్లో నమోదైన తొలి రోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధరైన రూ.949తో పోలిస్తే రూ.81.80 తక్కువగా  రూ.867.20 వద్ద బీఎస్‌ఈలో షేరు నమోదైంది. ఇంట్రాడేలో రూ.860.10కి దిగివచ్చినా, చివరకు 7.75% (రూ.73.55) నష్టంతో రూ.875.45 వద్ద ముగిసింది. మొత్తం 27.52 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఎన్‌ఎస్‌ఈలో కూడా ఇష్యూ ధర కంటే రూ.77 తక్కువగా రూ.872 వద్ద ఈ షేరు నమోదైంది.  రూ.860 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖరుకు 7.77% (రూ.73.75) నష్టంతో రూ.875.25 వద్ద స్థిరపడింది. 4.87 కోట్ల షేర్లు చేతులు మారాయి.

తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసేనాటికి ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.5.54 లక్షల కోట్లుగా నమోదైంది. తద్వారా దేశీయంగా అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన అయిదో కంపెనీగా నిలిచింది.  

పాలసీదార్లు, చిన్న మదుపర్లకు నష్టం పరిమితమే

ఒక మదుపరికి ఒక లాట్‌ (15 షేర్లు) కేటాయింపు జరిగితే.. ఇష్యూ ధర అయిన రూ.949 ప్రకారం అతని పెట్టుబడి రూ.14,235 అవుతుంది. తొలి రోజు బీఎస్‌ఈలో షేరు రూ.73.55 నష్టపోవడంతో.. పెట్టుబడి రూ.13131.75కి తగ్గింది. అంటే.. రూ.1,103.25 నష్టం వచ్చింది. యాంకర్‌ ఇన్వెస్టర్లు, సంస్థాగత, సంస్థాగతేతర మదుపర్లకే ఈ మేర నష్టం ఏర్పడింది.

పాలసీదారుకు ఇష్యూ ధరలో రూ.60 తగ్గింపు ఉండటంతో షేరుకు రూ.889చొప్పున ఒక లాట్‌ పెట్టుబడి రూ.13,335 మాత్రమే. బీఎస్‌ఈ ధర ప్రకారం తొలి రోజు నష్టం (15 శ్రీ 13.55) రూ.203.25 మాత్రమే.

చిన్న మదుపరికి రూ.45 డిస్కౌంట్‌ కారణంగా... షేరుకు రూ.904 చొప్పున పెట్టుబడి రూ.13,560 అవుతుంది. తొలి రోజు నష్టం (15 శ్రీ 28.55) రూ.428.25

మార్కెట్లో ఒడుదొడుకుల వల్లే : దీపమ్‌  

స్టాక్‌ మార్కెట్లో అనూహ్య పరిస్థితులు, ఒడుదొడుకుల వల్లే ఎల్‌ఐసీ షేర్లు తొలి రోజు పేలవ ప్రదర్శన కనబర్చాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. మంచి ప్రతిఫలం కోసం దీర్ఘకాలానికి షేరును అట్టేపెట్టుకోవాలని మదుపర్లకు సూచించారు. పాలసీదార్లు, చిన్న మదుపర్లకు ఇష్యూ ధరలో తగ్గింపు లభించడం వల్ల వాళ్లకు తొలి రోజు నష్ట ప్రభావం నుంచి కొంత రక్షణ లభించిందని అన్నారు. పబ్లిక్‌ ఇష్యూలో షేర్లు పొందని చాలా మంది.. ముఖ్యంగా పాలసీదార్లు సెకండరీ మార్కెట్లో కొనుగోలుకు మొగ్గు చూపుతారని, దీంతో మున్ముందు ధర పెరుగుతుందని ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ తెలిపారు. తొలిసారి స్టాక్‌ మార్కెట్లో అడుగుపెట్టిన మదుపర్ల నుంచి 10.85 లక్షల దరఖాస్తులు రాగా.. 7 లక్షల మందికి షేర్ల కేటాయింపు జరిగిందని పాండే తెలిపారు. మొత్తం మదుపర్లలో 46% మంది దేశ పశ్చిమ ప్రాంతానికి చెందిన వారు కాగా.. దక్షిణాది, ఉత్తరాది నుంచి 44% మంది ఐపీఓలో పాల్గొన్నారని వివరించారు. దేశంలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చిన ఐపీఓగా ఎల్‌ఐసీ చరిత్ర సృష్టించిందని తెలిపారు.


ఇప్పుడేం చేయాలి?

ఎల్‌ఐసీ షేరు ఇష్యూ ధర కంటే తక్కువగా నమోదై, నష్టంతో ముగియడంతో, ఈ షేరును అట్టేపెట్టుకోవచ్చా..  ధర తగ్గినపుడు మరిన్ని షేర్లు జత చేసుకోవాలా? లేదంటే కొంత కాలం వేచిచూడాలా? అనే సందేహాలు మదుపర్లలో నెలకొన్నాయి. దీనిపై స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఐపీఓలో కేటాయింపు ద్వారా షేర్లు పొందిన మదుపర్లు   రూ.800 దరిదాపులో స్టాప్‌లాస్‌ పెట్టుకుని, వాటిని దీర్ఘకాలానికి అట్టేపెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రతి 5% ధర తగ్గినప్పుడల్లా మరిన్ని షేర్లు కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు.

కొత్తగా కొనుగోలు చేసే వాళ్లు మాత్రం రూ.730 కంటే కిందకు రానంతవరకు, ఒక క్రమ పద్ధతిలో కొంచెం కొంచెం కొనుక్కోవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనుజ్‌ గుప్తా సలహా ఇస్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఎటువంటి డివిడెండు ఇవ్వనందున.. ఈసారి ఆకర్షణీయ డివిడెండు ప్రకటించే అవకాశం ఉందని, ఇది భవిష్యత్‌లో షేరు పెరిగేందుకు తోడ్పడొచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా అభిప్రాయపడ్డారు.

పోటీపరంగా ఎల్‌ఐసీకి పలు సానుకూలతలు ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలానికి షేరును అట్టేపెట్టుకోవచ్చని ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్ఘ్‌ న్యాటి తెలిపారు.

షేరు ధరలో స్థిరత్వం వచ్చే వరకు కొత్తగా కొనుగోలు చేయదలచిన వాళ్లు వేచిచూడటం మంచిదని జీసీఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ఛైర్మన్‌ రవి సింఘాల్‌ చెబుతున్నారు. దీర్ఘకాలానికి కొనుగోలు చేసే యోచనలో ఉన్న వాళ్లు రూ.735 వద్ద స్టాప్‌లాస్‌ను తప్పక పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని