గోవా విమానాశ్రయం ఆగస్టులో ప్రారంభం

ఉత్తర గోవాలో నిర్మిస్తున్న నూతన విమానాశ్రయాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించడానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిద్ధమవుతోంది. కొంత కాలం క్రితం ఉత్తర గోవాలోని మోపా

Published : 19 May 2022 02:43 IST

‘డిజైనింగ్‌’ దశలో భోగాపురం విమానాశ్రయం 

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర గోవాలో నిర్మిస్తున్న నూతన విమానాశ్రయాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించడానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిద్ధమవుతోంది. కొంత కాలం క్రితం ఉత్తర గోవాలోని మోపా విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టు జీఎంఆర్‌ దక్కించుకుంది. దీని ప్రకారం నిర్మాణాలు చేపట్టి, శరవేగంగా పనులు పూర్తిచేస్తోంది. రూ.2,600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రభుత్వంతో జీఎంఆర్‌ కుదుర్చుకున్న ‘కన్సెషన్‌ అగ్రిమెంట్‌’ ప్రకారం 40 ఏళ్ల పాటు ఈ విమానాశ్రయం నిర్వహణ హక్కులు జీఎంఆర్‌కు ఉంటాయి. ఆ తర్వాత మరో 20 ఏళ్లు పొడిగింపు పొందొచ్చు. తొలి దశలో ఆ విమానాశ్రయం నుంచి 77  లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు.  మోపా విమానాశ్రయాన్ని జాతీయ రహదారి- 66 తో కలిపే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం త్వరలో మొదలుకానుందని, వచ్చే ఏడాదిలో ఈ రహదారి అందుబాటులోకి వస్తుందని  వెల్లడించింది. 

ఇతర విమానాశ్రయాలు: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి డిజైన్‌ పనులు మొదలుపెట్టినట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. తద్వారా త్వరలో పనులు ప్రారంభం కాగలవనే సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతోంది. దీనికి సంబంధించి ఇంకా కొంత భూసేకరణ పనులున్నాయని, భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు పూర్తికావాల్సి ఉందని వెల్లడించింది. దిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల విస్తరణ పనులు నిర్ణీత ప్రణాళిక ప్రకారం సాగుతున్నట్లు పేర్కొంది. నాగపూర్‌ విమానాశ్రయ నిర్మాణానికి ఎదురైన చిక్కులు తొలగిపోతున్నందున త్వరలో నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రుణ భారం: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు ఈ ఏడాది మార్చి 31 నాటికి  రూ.26,300 కోట్ల రుణభారం ఉంది. ఇందులో దాదాపు 90 శాతం విమానాశ్రయాల నిర్మాణం కోసం తీసుకున్న అప్పే. మరోపక్క ఈ సంస్థ నెమ్మదిగా నష్టాలు తగ్గించుకుంటూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.4959 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.752 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది. 2020-21లో ఆదాయం రూ.3996 కోట్లు కాగా, దానిపై రూ.1243 కోట్ల నికరనష్టం ఉండటం గమనార్హం. 

జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాకు రూ.272 కోట్ల నష్టం 

జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.272.48 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.998.34 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.947.55 కోట్ల నుంచి రూ.1,272 కోట్లకు పెరిగింది 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని