ఉచిత శాంపిళ్లనూ వైద్యులు ఆదాయంగా చూపించాలి

వృత్తి, వ్యాపారం నిర్వహించే వారు అందుకునే వివిధ రకాల భత్యాల (బెనిఫిట్్స/పెర్కుల)ను ఆదాయంగానే పరిగణించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వీటిని నగదు లేదా ఇతర రూపంలో అందుకున్నా పన్ను పరిధిలోకి వస్తాయని ఆర్థిక

Published : 19 May 2022 05:57 IST

ఇతర ప్రయోజనాలూ లెక్కలోకే

ఆదాయపు పన్ను విభాగం వెల్లడి

దిల్లీ: వృత్తి, వ్యాపారం నిర్వహించే వారు అందుకునే వివిధ రకాల భత్యాల (బెనిఫిట్్స/పెర్కుల)ను ఆదాయంగానే పరిగణించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వీటిని నగదు లేదా ఇతర రూపంలో అందుకున్నా పన్ను పరిధిలోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కమలేశ్‌ సి వర్షిణి తెలిపారు. 2022-23 బడ్జెట్‌లో ఈ ప్రయోజనాల చెల్లింపుపై మూలం వద్ద పన్ను కోత విధించాలనే నిబంధనలు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్‌ 194ఆర్‌ను తీసుకొచ్చారు. వృత్తి, వ్యాపారం నిర్వహించే వారు ఏడాదికి రూ.20వేలకు మించి ప్రయోజనాలు/భత్యాలు అందుకున్నప్పుడు మూలం వద్ద 10 శాతం పన్ను కోత విధించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అసోచాం నిర్వహించిన ఒక సమావేశంలో కమలేశ్‌ మాట్లాడుతూ ‘ఎంతోమంది అదనపు ప్రయోజనాలు పొందుతున్నా వాటికి పన్ను చెల్లించడం లేదు. దీన్ని అరికట్టేందుకు కొత్త సెక్షన్‌ తీసుకొచ్చామ’ని వివరించారు. ఈ సెక్షన్‌పై ఉన్న సందేహాలన్నింటికీ జులై 1 నాటికి వివరణ ఇస్తామని తెలిపారు. 

దీనికి ఉదాహరణలు పేర్కొంటూ.. వైద్యులకు ఉచితంగా ఔషధ శాంపిళ్లు, లేదా ఇతర ప్రయోజనాలు అందుతుంటాయి. సాధారణంగా వీటిని ఆదాయంలో చూపించరు. ఔషధ సంస్థలు వీటిని తమ అమ్మకాలు పెంచుకునేందుకు అందించినా.. వైద్యులు మాత్రం తమ ఆదాయంగానే చూపించి, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఉచిత శాంపిళ్లకూ ఒక విలువ ఉంటుందని, దాని ఆధారంగానే సెక్షన్‌ 194ఆర్‌ దీనికి వర్తిస్తుందన్నారు. ఔషధ సంస్థలు తమ వ్యాపార వృద్ధి కోసం ఇచ్చిన అన్ని రకాల ప్రయోజనాలనూ సేల్స్‌ ప్రమోషన్‌ ఖర్చు కింద చూపించుకోవచ్చని తెలిపారు. వీటిని అందుకున్న వ్యక్తులకు మాత్రం ఇది ఆదాయంగా మారుతుందని, కాబట్టి, టీడీఎస్‌ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. వివిధ వ్యాపారాలు నిర్వహించేవారు, వృత్తి నిపుణులు ఉచితంగా ఐపీఎల్‌ టికెట్లు, విదేశీ ప్రయాణానికి విమాన టికెట్లు అందుకున్నా, వీటిని ఆదాయంగానే చూపాల్సి ఉంటుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని