పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ లాభం రూ.346 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ రూ.346 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.160.79 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు.

Published : 20 May 2022 02:49 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ రూ.346 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.160.79 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు. మొండి బకాయిలు తగ్గడమే ఇందుకు కారణమని బ్యాంక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. మొత్తం ఆదాయం రూ.1,940.62 కోట్ల నుంచి రూ.2,007.90 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) 13.76 శాతం నుంచి 12.17 శాతానికి తగ్గాయి. విలువ పరంగా ఇవి రూ.9,334 కోట్ల నుంచి రూ.8,565 కోట్లకు తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 4.04 శాతం (రూ.2,461.95 కోట్లు) నుంచి 2.74 శాతానికి (రూ.1,742.27 కోట్లు) పరిమితమయ్యాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,993 కోట్ల నుంచి రూ.866 కోట్లకు తగ్గాయి. ‘బ్యాంక్‌ బలమైన రికవరీ సాధించింది. రిటైల్‌ రుణాల మీద అధికంగా దృష్టి సారించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం మేర రుణ వృద్ధిని ఆశిస్తున్నామ’ని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎస్‌.కృష్ణన్‌ వెల్లడించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచాక, తమ బ్యాంక్‌ రుణ రేట్లనూ పెంచినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఆర్‌బీఐ రేట్లు పెంచితే దానికనుగుణంగా రుణ రేట్లు పెంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ 2.8 శాతం నుంచి 5-10 బేసిస్‌ పాయింట్లు (0.05-0.10 శాతం) పెరగొచ్చని తెలిపారు.

* 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ రూ.1,039.05 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.2,732.90 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

* రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 0.31 పైసలు (3.1 శాతం) డివిడెండ్‌ను బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

* 2021-22లో కేంద్రం రూ.4,600 కోట్ల నిధుల్ని బ్యాంక్‌కు మూలధన సాయం కింద అందించింది. ఇందుకు ప్రతిగా బ్యాంక్‌ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో 272.51 కోట్ల షేర్లను కేటాయించింది. 2022 మార్చి 31 నాటికి బ్యాంక్‌లో ప్రభుత్వానికి 98.25 శాతం వాటా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని