డ్రైవర్లకు గమ్యం ముందే తెలుస్తుంది

ప్రయాణికులను ఫలానా చోటుకు తీసుకెళ్లేందుకు ఒప్పుకోవాలా? వద్దా? అనే నిర్ణయాన్ని  తీసుకోవడానికి వీలుగా డ్రైవర్లకు గమ్యస్థానాల వివరాలను తెలియజేస్తున్నామని ఉబర్‌ తెలిపింది.

Published : 20 May 2022 02:48 IST

 ప్రయాణాల రద్దు సమస్య తలెత్తకుండా: ఉబర్‌ 

దిల్లీ: ప్రయాణికులను ఫలానా చోటుకు తీసుకెళ్లేందుకు ఒప్పుకోవాలా? వద్దా? అనే నిర్ణయాన్ని  తీసుకోవడానికి వీలుగా డ్రైవర్లకు గమ్యస్థానాల వివరాలను తెలియజేస్తున్నామని ఉబర్‌ తెలిపింది. డ్రైవర్లు ట్రిప్‌లను తరచు రద్దు చేస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఉబర్‌ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ట్రిప్‌ ఒప్పుకోడానికి ముందే డ్రైవర్లకు గమ్యస్థానాల వివరాలను తెలియజేసే సదుపాయం ఇప్పటికే 20 నగరాల్లో ఉందని, దీనిని ఇతర నగరాలకు విస్తరిస్తున్నట్లు ఉబర్‌ తెలిపింది. వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించుకోకుంటే, సేవలను మెరుగుపరచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని ఓలా, ఉబర్‌ లాంటి క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలను ప్రభుత్వం ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘ట్రిప్‌ రద్దు, డ్రైవర్లు ప్రయాణ సమయంలో ఏసీ వేయకపోవడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు తిరస్కరిస్తుండటం లాంటి సమస్యలను పరిష్కరించేందుకు కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చామ’ని ఉబర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘డ్రైవరు మీకు ఫోన్‌ చేసి ఎక్కడి వెళ్లాలి అన్ని ప్రశ్నించాక.. మీ సమాధానం విని ఆ ప్రయాణాన్ని రద్దు చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మేం అర్థం చేసుకోగలం. ఆ ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతో ఫలానా చోటుకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఒప్పుకోవాలా? వద్దా? అనే నిర్ణయాన్ని డ్రైవర్లు తీసుకునేందుకు వీలుగా, వాళ్లకు ఆ గమ్యస్థానాల వివరాలను తెలియజేస్తున్నామ’ని వివరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని