Published : 21 May 2022 02:37 IST

సూచీలు సై సై

నడిపించిన రిలయన్స్‌ షేర్లు

16,200 పైకి నిఫ్టీ

రూ.5.05 లక్షల కోట్లు పెరిగిన సంపద

భారీ నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ సూచీలు కోలుకోవడంతో మదుపర్లు దిగువ స్థాయుల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో వారంలో ఆఖరిరోజైన శుక్రవారం సెన్సెక్స్‌ 1534 పాయింట్లు పరుగులు తీయగా, నిఫ్టీ 16,200 పాయింట్ల ఎగువకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి  77.53 వద్ద ముగిసింది. చైనా కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్లలో కోత విధించడం సానుకూల ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు సానుకూలంగా కదలాడాయి.

* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.05 లక్షల కోట్లు పెరిగి రూ.254.11 లక్షల కోట్లకు చేరింది.

* సెన్సెక్స్‌ ఉదయం 53,513.97 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 54,396.43 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1534.16 పాయింట్ల లాభంతో 54,326.39 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 456.75 పాయింట్లు రాణించి 16,266.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,283.05 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 1532.77 పాయింట్లు, నిఫ్టీ 484 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

* ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ షేరు ఇష్యూ ధర రూ.630తో పోలిస్తే బీఎస్‌ఈలో 4.76% లాభంతో రూ.660 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 14.10% కుదేలైన షేరు రూ.541.15 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు    10.68% నష్టంతో    రూ.562.70 వద్ద ముగిసింది.

* వ్యవస్థాపక సీఈఓ పీఎన్‌ వాసుదేవన్‌ వైదొలగనున్నట్లు సంకేతాలివ్వడంతో ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు 11.38% కుదేలై రూ.52.55 దగ్గర స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లూ లాభాలు నమోదు చేశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ 8.10%, నెస్లే 4.74%, టాటా స్టీల్‌ 4.22%, ఎల్‌ అండ్‌ టీ 4.01%, యాక్సిస్‌ బ్యాంక్‌    3.55%, సన్‌ఫార్మా 3.51%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.47%, ఎస్‌బీఐ 3.31%, హెచ్‌డీఎఫ్‌సీ 3.13%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.79%, హెచ్‌యూఎల్‌ 2.74%, కోటక్‌ బ్యాంక్‌ 2.61% చొప్పున దూసుకెళ్లాయి. అన్ని రంగాల వారీ సూచీలు కళకళలాడాయి.


ఎల్‌ఐసీ  మార్కెట్‌ విలువ రూ.77,600 కోట్లు ఆవిరి

ఎల్‌ఐసీ షేర్ల నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. శుక్రవారం ఇంట్రాడేలో రూ.825.05 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 1.72 శాతం నష్టంతో రూ.826.25 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5,22,602.94 కోట్లుగా నమోదైంది. ఐపీఓ గరిష్ఠ ధర రూ.949 ప్రకారం.. ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.6,00,242 కోట్లుగా ఉంది. అంటే గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో ఎల్‌ఐసీ మదుపర్ల సంపద      రూ.77,600 కోట్లకు పైగా ఆవిరైంది. మార్కెట్‌ విలువ పరంగా అయిదో విలువైన కంపెనీగా ప్రారంభమైన ఎల్‌ఐసీ.. ప్రస్తుతం ఆరో స్థానానికి పడిపోయింది. రూ.5,46,397.45 కోట్ల మార్కెట్‌ విలువతో హెచ్‌యూఎల్‌ 5వ స్థానంలో నిలిచింది.


రిలయన్స్‌.. 18 నెలల్లో అతిపెద్ద లాభం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 18 నెలల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని నమోదుచేసింది. శుక్రవారం ఒకదశలో 6 శాతం లాభంతో రూ.2643 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 5.77 శాతం పెరిగి రూ.2622.15 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.17.73 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్‌ 8 శాతం నష్టపోగా.. రిలయన్స్‌ షేరు మాత్రం 9 శాతం లాభాలను అందించింది. మార్చి త్రైమాసికంలో రికార్డు లాభాన్ని నమోదు చేయడం, 2021-22లో 100 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయాన్ని నమోదుచేసిన తొలి కంపెనీగా అవతరించడం మదుపర్లలో అంచనాలను పెంచింది.


Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని