జెట్‌ ఎయిర్‌వేస్‌కు అనుమతులు

జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ ఎగిరేందుకు అధికారిక అనుమతులు లభించాయి. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ, ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికేట్‌ (ఏఓసీ)ను శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌కు

Published : 21 May 2022 02:37 IST

జులై- సెప్టెంబరులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం

దిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ ఎగిరేందుకు అధికారిక అనుమతులు లభించాయి. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ, ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికేట్‌ (ఏఓసీ)ను శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌కు మంజూరు చేసింది. అంటే వాణిజ్య కార్యకలాపాల పునరుద్ధరణకు అనుమతులు లభించినట్లే. ఈ ఏడాది జులై- సెప్టెంబరులో వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ఉద్దేశంలో సంస్థ ఉంది.

ఆర్థిక కారణాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు 2019 ఏప్రిల్‌ 17న నిలిచిపోయాయి. రుణ సంక్షోభం కారణంగా అప్పటి నుంచి కార్యకలాపాలను ఆపేసింది. గతంలో నరేశ్‌ గోయల్‌ నేతృత్వంలో నడిచిన ఈ సంస్థకు, ప్రస్తుతం జలాన్‌- కాల్‌రాక్‌ కన్షార్షియం ప్రమోటరుగా ఉంది. ఈనెల 15, 17 తేదీల్లో డీజీసీఏ అధికారుల సమక్షంలో ఐదు ప్రూవింగ్‌ విమానాలను సంస్థ విజయవంతంగా నడిపించింది. ఒక విమానయాన సంస్థకు ఏఓసీ లభించాలంటే చివరి దశ కింద ప్రూవింగ్‌ విమానాలను విజయవంతంగా నడపించి చూపించాల్సి ఉంటుంది. ఏఓసీ పొందడంతో జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ ఆమోదించిన రుణ పరిష్కార ప్రణాళిక కింద ఉన్న షరతులన్నింటిని జలాన్‌- కాల్‌రాక్‌ సంతృప్తిపర్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. రాబోయే కొన్ని వారాల్లో ఎన్ని విమానాలు నడపబోతోందీ, నెట్‌వర్క్‌, లాయల్టీ ప్రోగ్రామ్‌ సహా ఇతర వివరాలను దశలవారీగా వెల్లడిస్తామని పేర్కొంది. అదనపు ఉన్నత యాజమాన్య నియామకాల వివరాలను వచ్చే వారంలో తెలియజేస్తామని వివరించింది. సిబ్బంది నియామకాలను సాధ్యమైనంత త్వరగా చేపడతామని, వీలున్న చోట్ల జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు