మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌లో వాటాపై అపోలో హాస్పిటల్స్‌ ఆసక్తి?

దేశవ్యాప్తంగా డయాగ్నొస్టిక్‌ సేవల్లో నిమగ్నమైన మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ లో వాటా కొనుగోలు చేసేందుకు అపోలో హాస్పిటల్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక

Updated : 21 May 2022 06:11 IST

పోటీలో ఫ్లిప్‌కార్ట్‌, మరికొన్ని సంస్థలు

డయాగ్నొస్టిక్‌ సేవల మార్కెట్‌లో అధిక వృద్ధి వల్లే

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా డయాగ్నొస్టిక్‌ సేవల్లో నిమగ్నమైన మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌లో వాటా కొనుగోలు చేసేందుకు అపోలో హాస్పిటల్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక భాగస్వాముల నుంచి దాదాపు రూ.2,200 కోట్లకు పైగా నిధులు (300 మిలియన్‌ డాలర్లు) సమీకరించే ఆలోచన మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌కు ఉంది. దీనికి వీలుగా కొంత వాటా విక్రయించాలని భావిస్తోంది. ఈ విషయమై కొంతకాలంగా వ్యూహాత్మక భాగస్వాములు, విదేశీ ఇన్వెస్టర్లు, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో సంప్రదింపులు సాగిస్తోంది. మెట్రోపొలిస్‌తో జట్టుకట్టడం తనకు కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్న అపోలో హాస్పిటల్స్‌, ఆ సంస్థలో వాటా కొనుగోలుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక దఫా సంప్రదింపులు జరిగినట్లు చెబుతున్నారు.
ఈ కంపెనీలు కూడా: దేశీయ ఇ-కామర్స్‌ దిగ్గజం- ఫ్లిప్‌కార్ట్‌, అగ్రశ్రేణి ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలైన కేకేఆర్‌ అండ్‌ కంపెనీ, టీపీజీ గ్రూపు, బేరింగ్స్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సైతం మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

మార్కెట్‌ విలువ రూ.9000 కోట్లు: దేశీయ స్టాక్‌మార్కెట్లో నమోదైన మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) రూ.9,000 కోట్లుగా ఉంది. 

అపోలో ప్రయత్నాలు ఇవీ: అపోలో హాస్పిటల్స్‌ కొంతకాలంగా డయాగ్నొస్టిక్‌ సేవల్లోకి విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విస్తృత స్థాయిలో ఆసుపత్రులు, ఔషధ దుకాణాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ డయాగ్నొస్టిక్‌ సేవలు (రోగ నిర్థారణ పరీక్షలు) సైతం అందించడం ద్వారా రోగులకు మరింతగా దగ్గర కావాలని భావిస్తోంది. మెట్రోపొలిస్‌ వంటి సంస్థలో వాటా కొనుగోలు ద్వారా సత్వరం డయాగ్నొస్టిక్‌ సేవల్లోకి విస్తరించే అవకాశం ఉన్నందున అపోలో హాస్పిటల్స్‌ దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

61 నగరాల్లో: మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌కు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 61 నగరాల్లో డయాగ్నొస్టిక్‌ సేవల కేంద్రాలున్నాయి. 3,500 కు పైగా క్లినికల్‌ ల్యాబ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తోంది.


ఇదీ ప్రధాన కారణం

ఇటీవల కాలంలో డయాగ్నొస్టిక్‌ సేవలు అందించే సంస్థల్లో వాటా కొనుగోలుకు పలు సంస్థలు  ముందుకు వస్తున్నాయి. థైరోకేర్‌ టెక్నాలజీస్‌లో ఫార్మ్‌ఈజీ గత ఏడాదిలో మెజార్టీ వాటా కొనుగోలు చేసింది. మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ కూడా హైటెక్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ను 82 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది. ఆన్‌లైన్‌లో డయాగ్నొస్టిక్‌ సేవలు అందించే అవకాశం పెరగడం, తలసరి వైద్యసేవల బడ్జెట్‌ అధికం కావటం వంటి సానుకూలతల వల్ల ఈ రంగంలో వృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని భావించి వివిధ సంస్థలు, పెట్టుబడిదార్లు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని