Published : 21 May 2022 02:36 IST

సంక్షిప్త వార్తలు

మార్చిలో 15.32 లక్షల మంది కొత్త చందాదారులు: ఈపీఎఫ్‌ఓ

దిల్లీ: ఈ ఏడాది మార్చిలో నికరంగా 15.32 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకున్నట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది. ఫిబ్రవరిలో కొత్తగా చేరిన 12.85 లక్షల మందితో పోలిస్తే ఈ సంఖ్య 19 శాతం అధికం. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 2.47 లక్షల మంది అదనంగా చేరినట్లు కార్మిక శాఖ తెలిపింది. మార్చిలో చేరిన మొత్తం 15.32 లక్షల మంది చందాదారుల్లో.. దాదాపు 9.68 లక్షల మంది 1952 ఈపీఎఫ్‌ అండ్‌ ఎంపీ చట్టంలోని సామాజిక భద్రత కింద నమోదయ్యారు. మరో 5.64 లక్షల మంది ఈ పథకం నుంచి వైదొలగి, ఈపీఎఫ్‌ఓలో మళ్లీ చేరారు. ఈ ఏడాది మార్చిలో 18-25 సంవత్సరాల వారికి 2.93 లక్షలు, 22-25 సంవత్సరాల యువతకు 4.11 లక్షల ఉద్యోగాలు, 25-35 ఏళ్ల వారికి 3.17 లక్షల ఉద్యోగాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్త చందాదారుల్లో 18-25 సంవత్సరాల వాళ్లు సుమారు 45.96 శాతం ఉంటారు. మహిళల సంఖ్య 3.48 లక్షల వరకు ఉంది.


జిలింగో సీఈఓ అంకితి బోస్‌ తొలగింపు

దిల్లీ: సింగపూర్‌కు చెందిన ష్యాషన్‌ టెక్నాలజీ అంకుర సంస్థ జిలింగో భారత సంతతి సహవ్యవస్థాపకులు, సీఈఓ అంకితి బోస్‌ను తొలగించింది. తీవ్రమైన ఆర్థిక అవకతవకల ఫిర్యాదులపై స్వతంత్ర ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఖాతాల్లో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఈ ఏడాది మార్చి 31న బోస్‌ను సస్పెండ్‌ చేయగా.. తాజాగా పదవి నుంచి తొలగించినట్లు జిలింగో తెలిపింది. బోస్‌పై వచ్చిన ఆరోపణలు, ఆడిట్‌లో తేలిన అంశాల గురించి కంపెనీ వెల్లడించలేదు. జిలింగ్‌ సీఈఓ పదవి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాక,  వేధింపులకు సంబంధించిన కొన్ని ఆరోపణలను బోస్‌ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సంస్థ చర్యలు తీసుకుంది. దుస్తుల వర్తకులు, ఫ్యాక్టరీలకు టెక్నాలజీ సేవలను జిలింగో అందిస్తుంది. 2015లో ఈ సంస్థను అంకితి బోస్‌, ప్రస్తుత చీఫ్‌ టెక్నాలజీ అధికారి ధ్రువ్‌ కపూర్‌లు ప్రారంభించారు.


3-5 నెలల్లో వినియోగదారు ఫిర్యాదుల పరిష్కారం!  
కన్జూమర్‌ కమిషన్లకు కేంద్రం సూచన

దిల్లీ: వినియోగదారుల ఫిర్యాదులు ఇక వేగంగా పరిష్కారం కావచ్చు. కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద కేసు వాయిదాలను నెల కంటే ఎక్కువ కాలం తీసుకోవద్దని జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిషన్ల అధిపతులకు కేంద్ర ప్రభుత్వం సూచించడం ఇందుకు నేపథ్యం. ఆ మేరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిషన్లకు చెందిన రిజిస్ట్రార్లు, ప్రెసిడెంట్లకు కేంద్ర వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ లేఖ రాశారు. ‘దీర్ఘకాలం పాటు/తరచూ వాయిదాలు వేయడం అంటే పరిష్కారాలను కోరే వినియోగదారు హక్కులను కాలరాయడమే అవుతుంది. అది చట్ట స్ఫూర్తికి కూడా విరుద్ధమ’ని  అధికారిక ప్రకటన పేర్కొంది. కాబట్టి వినియోగదారు కమిషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ కాలం పాటు వాయిదాలు వేయరాదని సూచించింది. ప్రతి ఫిర్యాదును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరింది. వస్తువుల పరీక్ష, విశ్లేషణ అవసరం లేని చోట 3 నెలల్లోగా; అవసరమైన చోట 5 నెలల్లోగా ఫిర్యాదు పరిష్కారం జరగాలని స్పష్టం చేసింది. సరైన కారణం లేకుండా వినియోగదారు కమిషన్లు వాయిదా వేయడానికి వీల్లేదని తెలిపింది. ’్ట్చ్చఁ్తiః (ఇ-డాఖిల్‌) పోర్టల్‌ ద్వారా వినియోగదార్లు ఫిర్యాదులు చేసేలా ప్రోత్సహించాలని అన్ని రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు రోహిత్‌ కుమార్‌ సింగ్‌ లేఖలో కోరారు.


సుబ్రతా రాయ్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జులై 13న

దిల్లీ: పట్నా హైకోర్టు ఆదేశాలపై సుబ్రతా రాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జులై 13న విచారిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. కొన్ని సహారా గ్రూప్‌ కంపెనీలు పెట్టుబడిదార్లకు నగదు వాపసు చేయడం లేదంటూ దాఖలైన కేసుకు సంబంధించి సుబ్రతా రాయ్‌ను హాజరుపరచాల్సిందిగా బిహార్‌ డీజీపీని పట్నా హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై మే 13న సుప్రీం కోర్టు స్టే విధించింది. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని బిహార్‌ ప్రభుత్వం చేసుకున్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలాలతో కూడిన బెంచ్‌ తాజా ఆదేశాలు జారీ చేసింది. జులై 13 వరకు మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 11న బెయిల్‌ పిటిషన్‌పై సహారా క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌, రాయ్‌లను వ్యతిరేక పార్టీలుగా చేర్చాలని, రాయ్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.


మరో ఫండ్‌ మేనేజర్‌ను తొలగించిన యాక్సిస్‌ ఏఎంసీ

దిల్లీ: చీఫ్‌ ట్రేడర్‌ వీరేశ్‌ జోషిని తొలగించిన మర్నాడే మరో ఫండ్‌ మేనేజర్‌ దీపక్‌ అగర్వాల్‌కు యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) ఉద్వాసన పలికింది. వీరేశ్‌ జోషి మాదిరే దీపక్‌ అగర్వాల్‌ కూడా ఫ్రంట్‌ రన్నింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక బ్రోకరు లేదా అనలిస్ట్‌ నుంచి అంతర్గత సమాచారాన్ని పొంది, ఖాతాదార్ల కంటే ముందే స్టాక్‌ మార్కెట్లో ట్రేడ్‌ చేయడం వంటి తప్పుడు కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఫ్రంట్‌ రన్నింగ్‌గా వ్యవహరిస్తారు. ‘2022 ఫిబ్రవరి నుంచి యాక్సిస్‌ ఏఎంసీ సుమోటోగా అంతర్గత దర్యాప్తు నిర్వహిస్తోంది. ఈ దర్యాప్తులో సహకారం కోసం బయటి సలహాదారులను ఉపయోగించుకుంటున్నాం. దర్యాప్తును అనుసరించి 2022 మే 20 నుంచి దీపక్‌ అగర్వాల్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు’ యాక్సిస్‌ ఏఎంసీ తెలిపింది. దీపక్‌ అగర్వాల్‌ తొలగింపునకు దారితీసిన ఉల్లంఘనల పూర్తి వివరాలను సంస్థ వెల్లడించలేదు.


ధనలక్ష్మీ బ్యాంక్‌ లాభం రూ.35 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ధనలక్ష్మీ బ్యాంక్‌ రూ.35.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆపరేటింగ్‌ లాభం రూ.134.30కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో రూ.23.42 కోట్ల నికర లాభాన్ని, రూ.63.62 కోట్ల ఆపరేటింగ్‌ లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే సమయంలో ఆపరేటింగ్‌ నష్టం రూ.12.85 కోట్లు, నికర లాభం రూ.5.28 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.20,847 కోట్లకు చేరుకుంది.


ఎజేస్‌ ఫెడరల్‌ లైఫ్‌ నుంచి ఐడీబీఐ బ్యాంక్‌ బయటకు
పూర్తి వాటా రూ.580 కోట్లకు విక్రయం

దిల్లీ: ఎజేస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఎఫ్‌ఎల్‌ఐ) లో తనకున్న పూర్తి వాటాను విక్రయించేందుకు ఎజేస్‌ ఇన్సూరెన్స్‌ ఇంటర్నేషనల్‌ (ఎన్‌వీ)తో ఐడీబీఐ బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎజేస్‌ ఫెడరల్‌ లైఫ్‌లో 20,00,00,000 ఈక్విటీ షేర్లను రూ.580 కోట్లకు విక్రయించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది. ప్రతిపాదిత ఈ విక్రయ లావాదేవీ పూర్తయ్యేందుకు నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అనుమతులు లభిస్తే 2022-23 రెండో త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏఎఫ్‌ఎల్‌ఐ.. మూడు సంస్థల సంయుక్త సంస్థ. ఇందులో ఐడీబీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎజేస్‌ ఇన్సూరెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎన్‌వీ (ఐరోపాలోని దిగ్గజ బీమా కంపెనీ)కి వాటాలున్నాయి. 2022 మార్చి 31 నాటికి ఏఎఫ్‌ఎల్‌ఐలో ఐడీబీఐ బ్యాంక్‌కు 25 శాతం వాటా ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌ వాటాను ఎజేస్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేస్తే... జీవిత బీమా రంగంలోని ఒక కంపెనీలో ఓ విదేశీ సంస్థ వాటా నిర్దేశిత గరిష్ఠ పరిమితైన 74 శాతానికి చేరడం మొదటిసారి అవుతుంది.


ఓలా, ఉబర్‌లకు నోటీసులు

దిల్లీ: అన్యాయమైన వాణిజ్య విధానాలు అవలంబిస్తున్న క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలైన ఓలా, ఉబర్‌ లకు వినియోగదారు రక్షణ నియంత్రణ సంస్థ సీసీపీఏ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ 2 సంస్థలపై కలిపి 3300 కేసులున్నాయి. వినియోగదారుల హక్కులకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయని సీసీపీఏ పేర్కొంది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.


పెరిగిన పేటీఎమ్‌ నష్టం

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం చివరి(జనవరి-మార్చి) త్రైమాసికంలో పేటీఎం మాతృసంస్థ ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ ఏకీకృత నష్టాలు మరింత పెరిగి రూ.761.4 కోట్లకు చేరాయి. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.441.8 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.815.3 కోట్ల నుంచి 89 శాతం వృద్ధి చెంది రూ.1,540.9 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరాని(2021-22)కి  నష్టాలు రూ.2,396.4 కోట్లకు పెరిగాయి. 2020-21 నష్టం రూ.1,701 కోట్లే. వార్షిక ఆదాయాలు మాత్రం  77.49% పెరిగి రూ.4,974.2 కోట్లుగా నమోదయ్యాయి.


ఆర్‌బీఐ డివిడెండు రూ.30,307 కోట్లు

ముంబయి: గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.30,307 కోట్ల డివిడెండు చెల్లింపునకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. బిమల్‌ జలాన్‌ కమిటీ సిఫారసులను అనుసరించి అత్యవసర నిధులను (కంటిన్జెన్సీ రిస్క్‌ బఫర్‌) 5.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలో జరిగిన 596వ ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. గతేడాది తొమ్మిది నెలల సమయానికి (2020 జులై -2021 మార్చి) రూ.99,122 కోట్ల డివిడెండును ఆర్‌బీఐ ప్రకటించింది. ఆర్‌బీఐ అంతక్రితం జులై-జూన్‌ను ఆర్థిక సంవత్సరంగా అనుసరిస్తుండగా.. దానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏప్రిల్‌-మార్చికి మార్చడం కోసం ఆ గడువుకు చెల్లింపు జరిగింది.  
నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.73,948 కోట్ల డివిడెండును కేంద్రం అంచనా వేస్తోంది. 2021-22లో అందుకున్న రూ.1.01 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 27 శాతం తక్కువ.  


షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ నుంచి అత్యాధునిక ప్రింటర్లు

హైదరాబాద్‌ (మాదాపూర్‌), న్యూస్‌టుడే: షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) సరికొత్తగా ఉత్పత్తిచేసిన 8 మల్టీఫంక్షన్‌ ప్రింటర్లను సంస్థ ఎండీ షింజిమినటోగవా విడుదల చేశారు. థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న వీటి ధరలు రూ.81,884 నుంచి ప్రారంభమవుతాయన్నారు. దేశీయ ప్రింటర్‌ విపణిలో ప్రస్తుత 10% వాటాను వచ్చే ఏడాదికి 12 శాతానికి పెంచాలనేది లక్ష్యమన్నారు. భారత్‌లో సొంత ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధ్యయనం కొనసాగుతోందన్నారు. వాటర్‌ ఫ్యూరిఫైయర్‌, మైక్రోవేవ్‌ ఓవెన్‌, వాషింగ్‌మిషన్లనూ ప్రవేశపెట్టే యోచన ఉందన్నారు.


Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని