వంట నూనె మంట తగ్గొచ్చు

జూన్‌ నుంచి వంట నూనెల ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పామాయిల్‌ను ప్రపంచంలోనే ఎక్కువగా తయారు చేయడంతో పాటు ఎగుమతి చేసే ఇండోనేషియా, ఇటీవల తన ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించింది.

Published : 22 May 2022 02:57 IST

పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం తొలగించిన ఇండోనేషియా
ఉక్రెయిన్‌ నుంచి సన్‌ఫ్లవర్‌ నూనె రాక

జూన్‌ నుంచి వంట నూనెల ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పామాయిల్‌ను ప్రపంచంలోనే ఎక్కువగా తయారు చేయడంతో పాటు ఎగుమతి చేసే ఇండోనేషియా, ఇటీవల తన ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించింది. రేపటి (మే 23) నుంచి ఇది అమల్లోకి రానుంది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్నా, ఉక్రెయిన్‌ నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్‌) నూనె సరఫరాలు పెరిగే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.
28 మి.టన్నుల ఎగుమతికి అవకాశం: ఏటా ఇండోనేషియా 46 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఆహార అవసరాలకు 9 మి.టన్నులను; బయోడీజిల్‌ పథకానికి మరో 9 మి. టన్నులను వినియోగించుకోగా.. మిగతా 28 మి. టన్నులను ఎగుమతి చేస్తోంది. ఏప్రిల్‌ 28 నుంచి పామాయిల్‌ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించడంతో, వంటనూనెల ధరలు దేశీయంగా పెరిగాయి. ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేషియా ఈనెల 19న ప్రకటించగానే, మార్కెట్‌లో ధరలు 5% తగ్గాయి. దేశీయ అవసరాలకు తగ్గట్లు 10 మి.టన్నుల నిల్వలుంచాలని ఆ దేశ ప్రభుత్వం ఈనెల 20న పేర్కొనడంతో, మళ్లీ ధరలు 4% పెరిగాయని వంట నూనెల దిగుమతి కంపెనీ సన్‌విన్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సందీప్‌ బజోరియా వివరించారు.

సీజను మొదలైంది: ఇండోనేషియా పామాయిల్‌ ఉత్పత్తి సీజను ఇపుడు ప్రారంభమై, సెప్టెంబరుకు గరిష్ఠ స్థాయికి చేరనుంది. రష్యా యుద్ధానికి ముందు మనదేశంలో నెలవారీ పొద్దుతిరుగుడు నూనె వినియోగం 2 లక్షల టన్నులుగా ఉంది. అక్కడ నుంచి సరఫరా ఆగిపోవడంతో వినియోగం సగానికి తగ్గింది. ఇపుడు ఉక్రెయిన్‌ నుంచి నూనె సరఫరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందువల్ల నెలకు అదనంగా 20,000-25,000 టన్నుల మేర సన్‌ఫ్లవర్‌ నూనె సరఫరాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందువల్ల ధరలు అదుపులోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని