యుటిలిటీ వాహనాల హవా

కొత్త కార్ల విక్రయాల్లో యుటిలిటీ వాహనాల (యూవీ) వాటా క్రమంగా పెరుగుతోంది. సాధారణ కార్లతో పోలిస్తే, అధికులు వెళ్లేందుకు, సరకును తీసుకెళ్లేందుకు అనువుగా ఉండటం,....

Published : 22 May 2022 03:04 IST

కొత్త కార్ల అమ్మకాల్లో పెరుగుతున్న వాటా: ఫిచ్‌

ముంబయి: కొత్త కార్ల విక్రయాల్లో యుటిలిటీ వాహనాల (యూవీ) వాటా క్రమంగా పెరుగుతోంది. సాధారణ కార్లతో పోలిస్తే, అధికులు వెళ్లేందుకు, సరకును తీసుకెళ్లేందుకు అనువుగా ఉండటం, ఉత్పత్తి వ్యయాల వల్ల కాంపాక్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ కార్లపై తయారీదార్ల దృష్టి తగ్గుతూ ఉండడం ఇందుకు కారణమని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. అధిక కమొడిటీ ధరలు, అదనపు భద్రతా ప్రమాణాల వల్ల కార్ల ఉత్పత్తి వ్యయం ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. అధిక మార్జిన్లు ఇచ్చే యూవీ వాహనాల అమ్మకాలు పెరుగుతుండడంతో, తయారీదార్లకూ కొంత ఉపశమనం కలుగుతోందని పేర్కొంది.

* గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల అమ్మకాల్లో యూవీ వాటా 49 శాతానికి చేరింది. అంతక్రితం ఏడాది ఇది 28 శాతం మాత్రమే. మొత్తం కార్ల విక్రయాల్లో హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌ల వాటా 66 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది.
* యూవీ విభాగంలో.. ప్రారంభ, మధ్య స్థాయి యూవీల వాటా(మొత్తం కార్ల అమ్మకాల్లో) 20% నుంచి 30 శాతానికి పెరిగింది. గత కొన్నేళ్లలో హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే యూవీల అధిక ఆవిష్కరణలు ఈ వృద్ధికి దోహదం చేశాయి.
* పాత కారు మార్చాలనుకునేవారు, అధిక ఆదాయం కలిగిన వినియోగదారులు ఇష్టపడుతున్నందున యూవీల వాటా మరింత పెరగొచ్చు.
* ప్రారంభ, మధ్య స్థాయి యూవీ అమ్మకాలు 2020-21లో 21%; 2021-22లో 35 శాతం మేర పెరిగాయి. కరోనా నేపథ్యంలోనూ వీటి గిరాకీ తగ్గలేదు.
* భద్రతా ప్రమాణాలు, ఉద్గార ప్రమాణాలు, అధిక కమొడిటీ ధరల వల్ల 2018 నుంచి ప్రారంభ స్థాయి కార్ల ధరలు 20-30 శాతం మేర పెరిగాయి. దీంతో 2019-20 నుంచీ వీటి అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. 2021-22లో ప్రారంభ స్థాయి కార్ల వాటా 2018-19తో పోలిస్తే 32 శాతం తగ్గింది. అధిక ధరలు, కరోనా ప్రభావం కనిపించింది.
* ఈ ఏడాది అక్టోబరు నుంచి 3-5 శాతం మేర వాహన తయారీ వ్యయాలు పెరగొచ్చు. అదనపు ఎయిర్‌బ్యాగ్‌ల విషయంలో నిబంధనలు అమల్లోకి వస్తుండడం ఇందుకు నేపథ్యం. దీని వల్ల యూవీ విభాగంపై మరింతగా తయారీదార్లు దృష్టి సారించొచ్చు. ప్రారంభ స్థాయిలో కొత్త ఆవిష్కరణలు మరింత తగ్గొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని