Published : 23 May 2022 01:32 IST

సంక్షిప్తంగా

* దేశంలోని ప్రముఖ స్థిరాస్తి విపణుల్లో తన ఉనికిని విస్తరించుకునేందుకు రాబోయే నాలుగు- ఐదేళ్లలో రూ.7,500 కోట్లు పెట్టబడిగా పెట్టే యోచనలో ప్రెస్టీజ్‌ గ్రూపు ఉంది. ప్రస్తుతం దక్షిణాది విపణులకే పరిమితమైన ఈ సంస్థ ఇప్పటివరకు 250కి పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో గృహ సముదాయ, వాణిజ్య ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది.

* జీఎస్‌టీ నెలవారీ చెల్లింపుల ఫారం జీఎస్‌టీఆర్‌-3బీని నవీకరించే యోచనలో జీఎస్‌టీ మండలి ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్లెయిమ్‌లను నియంత్రించి, అర్హులైన వారికి సెటిల్‌మెంట్‌ను వేగవంతం అయ్యేలా చేయాలన్నది దీని వెనక ఉద్దేశమని ఓ అధికారి వెల్లడించారు. వచ్చే నెల సమావేశంలో దీనిపై జీఎస్‌టీ మండలి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

* 2021-22 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల నుంచి ఏటీఎం లావాదేవీల ఛార్జీల రూపేణా రూ.645 కోట్లు వసూలు చేసినట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అలాగే ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్‌ బ్యాలెన్స్‌)ను ఉంచని వినియోగదారులకు జరిమానా కింద రూ.239.09 కోట్లు వసూలు చేసింది.

* గత ఆర్థిక సంవత్సరంలో స్థిరాస్తి దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర రుణం 45 శాతం తగ్గి రూ.2680 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థ అప్పుడు రూ.4,885 కోట్లుగా ఉంది. స్థిరాస్తి విక్రయాలు అధికంగా నమోదుకావడం అప్పు తగ్గేందుకు దోహదపడిందని కంపెనీ తెలిపింది. కొత్త ప్రాజెక్టులను అందుబాటులోకి తేవడం వల్ల కూడా నగదు నిల్వలు పెరిగాయని పేర్కొంది. మున్ముందు కూడా అప్పును మరింత తగ్గించుకునే ఉద్దేశంలో ఉన్నామని కంపెనీ పేర్కొంది.

* డిప్రెషన్‌ బారిన పడిన వారి చికిత్సలో ఉపయోగించే బూప్రొపియన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఔషధానికి సంబంధించి 10,548 సీసాలను అమెరికా విపణి నుంచి రీకాల్‌ చేస్తున్నట్లు సన్‌ ఫార్మా వెల్లడించింది. ఓ వినియోగదారు ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

* ఫ్లై ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్స్‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు హిందుజా లేలాండ్‌ ఫైనాన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరించింది. ఎన్‌సీఎల్‌టీ అలహాబాద్‌ బెంచ్‌ 2022 ఏప్రిల్‌ 5న ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.


మ్యూచువల్‌ ఫండ్‌ల్లోకి రూ.1.08 లక్షల కోట్లు

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) 176 న్యూ ఫండ్‌ ఆఫరింగ్స్‌ (ఎన్‌ఎఫ్‌ఓలు)ను తీసుకొచ్చాయి. వీటిల్లో రిటైల్‌ మదుపర్లు రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2021-22లో ఈక్విటీ మార్కెట్లు పరుగులు తీయడం, మదుపర్ల ఆసక్తి ఇందుకు కలిసొచ్చాయి. అయితే నగదు లభ్యత తగ్గడం, వడ్డీ రేట్ల పెరుగుదల, స్టాక్‌ మార్కెట్ల స్థిరీకరణ, కార్యాలయాలకు ఉద్యోగులు వంటి కారణాలతో ఈ జోరు కొంతమేర తగ్గొచ్చని ఫయర్స్‌ హెడ్‌ (రీసెర్చ్‌) గోపాల్‌ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు.


రిలయన్స్‌కు స్టోర్ల బదిలీ మోసపూరితం
ఫ్యూచర్‌ డైరెక్టర్లకు అమెజాన్‌ లేఖ

దిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌నకు 835 స్టోర్లను బదిలీ చేయడం మోసపూరితమని ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు రాసిన లేఖలో అమెజాన్‌ ఆరోపించింది. అద్దె మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో బదిలీ చేశామని చెప్పడం అవమానకరమని, ఇందుకు కంపెనీకు నెల సమయం ఉందని, చెల్లించాల్సిన అద్దె మొత్తం రూ.250 కోట్లు మాత్రమేనని తెలిపింది. ఈ ఏడాది జనవరి 1న కీలక రుణదాతలతో సమావేశమైనట్లు మే 19న ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు పంపిన లేఖలో పేర్కొంది. ఫ్యూచర్‌ రిటైల్‌ స్వచ్ఛందంగా ఈ మొత్తాన్ని అట్టిపెట్టుకుందని వెల్లడించింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని